-

క్రమశిక్షణతో కరోనాకు కళ్లెం 

23 May, 2021 04:42 IST|Sakshi
దుగ్గిరాలపాడు గ్రామం

నాడు డెంగీతో విలవిలలాడిన ‘దుగ్గిరాలపాడు’ 

నేడు కరోనా రహిత గ్రామంగా రూపాంతరం 

ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో ఒక్క కేసూ నమోదు కాని వైనం 

దుగ్గిరాలపాడు (జి.కొండూరు): చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠంలా.. 2017లో డెంగీ జ్వరాలతో అల్లాడిపోయిన దుగ్గిరాలపాడు గ్రామ ప్రజలు నేడు సమష్టి కృషితో స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తమ గ్రామ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎదుర్కోగలుగుతున్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండల కేంద్రానికి 15 కిలోమీటర్లు దూరంలో తెలంగాణ సరిహద్దులో దుగ్గిరాలపాడు గ్రామం ఉంది. గ్రామంలో 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో మరోసారి డెంగీ లాంటి చేదు అనుభవం తలెత్తకూడదని భావించిన గ్రామస్థులు దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోందని తెలియగానే అంతా ఏకతాటిపైకి వచ్చి స్వీయ నియంత్రణ పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో ఒక్క కరోనా కేసు కూడా ఇక్కడ నమోదు కాలేదంటే ఆ గ్రామ ప్రజల క్రమశిక్షణ అర్థం చేసుకోవచ్చు. 

కఠిన నిబంధనలు 
కరోనా కట్టడికి గ్రామస్తులంతా కలిసి కఠిన నిర్ణయాలు తీసుకొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప గ్రామం దాటి ఎవ్వరూ బయటకు రావడం లేదు. బయటకు వస్తే మాస్క్‌లు తప్పక ధరిస్తున్నారు. గ్రామంలో శుభకార్యాలను సైతం రద్దు చేసుకున్నారు. నిత్యావసరాల కోసం షాపుల వద్దకు ఒక్కొక్కరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో నిబంధనలు పాటిస్తున్నారు. 

గ్రామంలో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ  

గ్రామంలోనే ఉపాధి 
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు బయటి గ్రామాలలో పనులకు పోకుండా గ్రామ సర్పంచ్‌ రాంబాబు అధికారులతో కలిసి గ్రామంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విరివిగా పనులు కల్పించేలా చర్యలు చేపట్టారు. నిత్యం మాస్క్‌లు ధరించి గ్రామంలోనే పనులు చేసుకుంటుండటంతో తమకు కరోనా పట్ల ఎలాంటి ఆందోళన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. 

నిత్యం శానిటేషన్‌ 
గ్రామంలో నిత్యం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపడుతున్నాం. డ్రైనేజీల్లో పూడిక తీత, రహదారుల వెంబడి బ్లీచింగ్‌ చల్లించడం, హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ, వాటర్‌ ట్యాంకుల క్లీనింగ్‌ వంటి పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పక్కా ప్రణాళికతో కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం. 
– జడ రాంబాబు, గ్రామ సర్పంచ్‌

 నిత్యం పర్యవేక్షణ 
నిత్యం గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తున్నాం. పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టడంతో పాటు కరోనా నియంత్రణ, నిబంధనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. 
– రామకృష్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శి 

మరిన్ని వార్తలు