ఆంధ్రప్రదేశ్‌లో అరకోటి మార్క్‌ దాటిన కరోనా టెస్టులు

20 Sep, 2020 03:08 IST|Sakshi

పరీక్షలు, నియంత్రణలో పలు రాష్ట్రాలకు ఆదర్శం 

సరికొత్త రికార్డుతో దేశంలోనే తొలి స్థానం 

ఆరు మాసాల్లో ఎన్నో ఒడిదుడుకుల నుంచి ఒడ్డుకు

పెద్ద రాష్ట్రాలు ఆశ్చర్యపోయేలా కరోనా నియంత్రణ

50 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రాలు ఐదే..

అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి

కేసులు తగ్గుముఖం.. పెరుగుతున్న రికవరీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో రికార్డు నమోదైంది. శనివారం ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రంలో 50,33,676 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. విభజనతో వైద్య పరంగా భారీగా మౌలిక వసతులను కోల్పోయిన్పటికీ, ఐదున్నర కోట్ల మందికి సర్కారు ఆపత్కాలంలో భరోసాగా నిలిచింది. ఆరు లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినా, మీకు మేము అండగా ఉన్నామంటూ సర్కారు పెద్దన్న పాత్ర పోషించింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయని చాలా రాష్ట్రాలు టెస్టులు పెద్దగా చేయలేదు. కానీ ఏపీ మాత్రం టెస్టులు ఎక్కువగా చేస్తేనే ‘ఎక్కువ మందిని ఐసొలేట్‌ చేయగలం, మరింత మందికి కరోనా సోకకుండా కాపాడగలం’ అన్న ఒకే లక్ష్యంతో ముందడుగు వేసింది. కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యే నాటికి ఒక్క ల్యాబొరేటరీ లేకపోయినా.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ లక్ష్యంగా సాంకేతిక వనరులను సమకూర్చుకుని, పడకలు ఏర్పాటు చేసి లక్షలాది మందిని కరోనా నుంచి గట్టెక్కించింది. జనాభా పరంగా చూస్తే గడిచిన కొన్ని నెలలుగా ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా దేశంలో ఏపీ పేరు మారుమోగుతోంది.

టెస్టుల్లో ఏపీ టాప్‌: దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. మన రాష్ట్ర జనాభా 5.34 కోట్లు. ఇప్పటి వరకు చేసిన టెస్టులు 50 లక్షలు దాటగా, మిలియన్‌ జనాభాకు 94,264 మందికి టెస్ట్‌లు చేసింది. 
► దేశంలో 138.7 కోట్ల జనాభా ఉంది. ఇంత పెద్ద దేశంలో ప్రతి 100 టెస్టుల్లో 8 టెస్టులకు పైన 5.34 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. మరోవైపు కొద్ది రోజులుగా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది.

ఒక్క ల్యాబొరేటరీ లేని స్థాయి నుంచి..
కరోనా కేసులు మొదలయ్యే నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ లేదు. అలాంటిది నేడు 14 ల్యాబొరేటరీలు ఏర్పాటు చేశాం. ట్రూనాట్‌మెషీన్లు ఏర్పాటు చేశాం. సగటున రోజుకు 70 వేల టెస్టులు చేస్తున్నాం. ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చుకోలేనంతగా ఈ సర్కారు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి టెస్టుల నుంచి నియంత్రణ వరకూ చర్యలు చేపట్టగలిగాం.
– డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

రికవరీ రేటులోనూ ముందంజ
► 85 శాతం రికవరీ రేటు దాటిన రాష్ట్రాలు 4 ఉండగా, అందులో ఏపీ ఒకటి. 91.55% రికవరీతో బీహార్‌ మొదటి స్థానంలో, 89.60 శాతంతో తమిళనాడు రెండవ స్థానంలో, 86.86% రికవరీతో పశ్చిమ బెంగాల్‌ మూడో స్థానంలో ఉంది. 85.91% రికవరీతో ఏపీ దేశంలో 4వ స్థానంలో కొనసాగుతోంది.
► దేశంలో 50 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది ఐదు రాష్ట్రాలు మాత్రమే. అందులో ఏపీ ఒకటి. విశేషమేమంటే ఈ ఐదు రాష్ట్రాలు జనాభాలో ఆంధ్రప్రదేశ్‌ కంటే పెద్దవి. క్రిటికల్‌ కేర్‌ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో మరణాల రేటు కూడా రాష్ట్రంలో బాగా తగ్గింది.

మరిన్ని వార్తలు