Corona Care: తాగునీటితో కరోనా రాదు 

2 May, 2021 03:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈత కొలనుల్లో మునగడం ద్వారా వచ్చే ప్రమాదం 

వేడి నీళ్లు తాగడం వల్ల వైరస్‌ను నియంత్రించలేం 

ఇతర వ్యాధుల టీకాలు కరోనాకు ఉపయోగపడవు 

స్టెరాయిడ్స్‌ వల్ల మరణాలు తగ్గించగలిగాం 

యాంటీబయోటిక్స్‌ వాడకం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు 

ఒకరి ప్రిస్క్రిప్షన్‌లోని మందులను ఇంకొకరు వాడటం ప్రమాదం 

రెమ్‌డెసివిర్‌ కరోనా వ్యాప్తిని తగ్గించగలదు.. ప్రాణాలను కాపాడలేదు 

నిపుణులతో సమీక్ష అనంతరం రాష్ట్రాలకు కేంద్రం సూచనలు 

సాక్షి, అమరావతి: కరోనా విషయంలో ఇప్పటికీ చాలామందికి అపోహలు, సందేహాలు ఉన్నాయి. ఏది చేయాలో.. ఏది చేయకూడదో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. మందుల వాడకంలోనూ ఇదే పరిస్థితి. కొంతమంది లేనిపోని యాంటీబయోటిక్స్‌పై ఆధారపడుతుండగా.. మరికొంతమంది రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ తప్ప మరేదీ ప్రాణాన్ని కాపాడలేదనే అపోహలో ఉన్నారు. కరోనా పాజిటివ్‌ అని తెలియగానే చాలామంది ఒకే ప్రిస్రి్కప్షన్‌ను అనేక మందికి పంపించడం.. అవే మందులు వాడుతుండటం చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనాకు సంబంధించి వివిధ అంశాలపై ఏప్రిల్‌ 30న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలువురు వైద్య నిపుణులతో సమీక్ష నిర్వహించారు. నిపుణుల సూచనలను రాష్ట్రాలకు తెలిపారు. నిపుణుల మార్గదర్శకాలు ఇలా..   
 
రెమ్‌డెసివిర్‌ ప్రాణాన్ని నిలపలేదు 
ప్రజా తాగునీటి వ్యవస్థ ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదు. తాగునీరు వైరస్‌తో కలుషితమై ఆ నీళ్లు తాగినంత మాత్రాన కరోనా రాదు. కానీ ఈత కొలనులో ఉన్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉండి, ఆ వ్యక్తి దగ్గరగా ఎవరైనా ఉంటే వారికి రావచ్చు. చాలామంది రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు మాత్రమే ప్రాణాన్ని నిలపగలవనే అపోహలో ఉన్నారు. ఇది నిజం కాదు. ఈ ఇంజక్షన్లు వైరస్‌ వ్యాప్తి వేగాన్ని తగ్గించగలవు గానీ నియంత్రించలేవు. రోగులకు ఈ ఇంజక్షన్లు చేయాలా.. వద్దా అనేది వైద్యులే నిర్ణయించాలి. ఇవి ఇంట్లో వేసుకునే ఇంజక్షన్లు కాదు.  
 
వేడినీళ్లు జలుబుకు ఉపశమనం మాత్రమే.. 
వేడి నీళ్లతో స్నానం చేయడం, వేడినీళ్లు తాగడం వల్ల కరోనాను నియంత్రించలేం. వేడి నీరు జలుబుకు ఉపశమనంగా మాత్రమే పనికొస్తుంది. కరోనా వైరస్‌ను చంపాలంటే 60 నుంచి 75 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. కానీ మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు మించి ఉండదు. వేడినీళ్లు తాగితే కరోనా చస్తుంది అనేది అపోహ మాత్రమే.  
 
ఆక్సిజన్‌పైనా అపోహలు 
ఇంట్లోనే ఉంటే ఆక్సిజన్‌ సాంద్రత తగ్గిపోతుందేమోనని కరోనా రోగులు భయపడుతున్నారు. 94 కంటే తక్కువగా ఉండి.. ఆయాసం ఉంటేనే వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లాలి. శ్వాసకోశ వ్యాధులు ఉన్న కొంతమంది ఆక్సిజన్‌ సాంద్రత 88 ఉన్నా జీవించగలుగుతున్నారు. కొంతమంది 40 నుంచి 45 రోజులు ఐసీయూలో ఉన్నప్పటికీ ఆక్సిజన్‌ సాంద్రతను మెరుగుపరుచుకోలేకపోయారు. ఇంట్లో ఆక్సిజన్‌ సాంద్రతను పెంచుకునేందుకు కాన్సన్‌ట్రేటర్లు ఉపయోగపడతాయి. 
 
ఇతర టీకాలు కరోనాకు పనిచేయవు 
న్యుమోనియాకు వేసే వ్యాక్సిన్‌ కరోనాకు పనికొస్తుందా అనేదానిపై నెదర్లాండ్స్‌లో అధ్యయనం చేశారు. అందులో ఇతర వైరస్‌లకు కనుగొన్న టీకాలు కరోనాకు పనికిరావు అని తేల్చారు. చాలామంది న్యుమోనియా టీకాలు కరోనాకు వేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు.  
 
డెక్సామెథజోన్‌తో గరిష్ట ప్రయోజనం 

ఫావి ఫిరావిర్‌ లేదా ఫాబి ఫ్లూ వంటి మందులు.. కరోనా సోకిన తొలి 3–4 రోజుల్లో వాడుకోవచ్చు. అయితే వీటిని వైద్యులు నిర్ణయించిన మేరకే వాడాలి. డెక్సామెథజోన్‌ అనే స్టెరాయిడ్‌ బాగా ఉపయోగపడుతోంది. తీవ్ర వ్యాధితో బాధపడుతున్న, వెంటిలేటర్లపై ఉన్నవారికి డెక్సామెథజోన్‌ గరిష్ట ప్రయోజనం చేకూరుస్తోంది. తేలికపాటి లక్షణాలకు దీన్ని వాడకుండా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటేనే వాడాలి. 
 
గర్భస్థ శిశువుకు తల్లి నుంచి కరోనా రాలేదు 
అప్పుడే జన్మించిన శిశువుకు తల్లి నుంచి కరోనా సంక్రమించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. వేరే రోగులు, ఇతర కారణాల వల్ల సంక్రమించే అవకాశం ఉంది. కరోనా సోకిన తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కూడా కరోనా రాదు. ఎన్‌95 మాస్కు వేసుకుని పాలు ఇవ్వచ్చు.  
 
కరోనా టీకాలు రోగ లక్షణాలను నిరోధిస్తాయి.. 
టీకా ఏదైనా సరే రెండు డోసులు వేసుకున్న రెండు వారాల తర్వాత కరోనా లక్షణాలను అదుపు చేయగలవు. వైరస్‌ సంక్రమణం ఉన్నా కూడా ప్రభావవంతంగా ఉండదు. అయినా సరే జాగ్రత్తగా ఉండటం మంచిది.    

మరిన్ని వార్తలు