చవితి వ్యాపారంపై కరోనా పంజా..

20 Aug, 2020 13:57 IST|Sakshi

జిల్లాలో రూ.10 కోట్లకు పైగా వ్యాపారానికి గండి 

విగ్రహ తయారీ కళాకారులకు భారీ నష్టం 

ఆర్థికంగా నష్టపోనున్న కార్మికులు, కళాకారులు  

ఆదాయం కోల్పోనున్న వ్యాపారులు 

రాజంపేట టౌన్‌: ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల వ్యాపారంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవడంతో వీధుల్లో  విగ్రహాల ఏర్పాటుకు అధికారులు  అనుమతులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధానంగా ఇప్పటికే గణపతి విగ్రహాలు తయారు చేసిన కొంతమంది  రాజస్థాన్‌ కళాకారులకు ఒకొక్కరికి  లక్షల్లో నష్టం వాటిల్లనుంది. వినాయక చవితి ఉత్సవాలనే నమ్ముకొని అప్పులు చేసి లక్షలు పెట్టుబడి పెట్టి విగ్రహాలను సిద్ధం చేసిన కళాకారులకు ఈ ఏడాది కరోనా కారణంగా భారీగా అప్పులు మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి.  

ఆదాయం, ఉపాధిపై తీవ్ర ప్రభావం.. 
ఈ ఏడాది æ విగ్రహాలను ఏర్పాటు చేయక పోవడం వల్ల వ్యాపారుల ఆదాయం, వివిధ రకాల కార్మికులు, కళాకారుల  ఉపాధిపై కరోనా ప్రభావం తీవ్రంగానే  చూపింది. ఇందులో ప్రధానంగా మండపాల నిర్మాణ కళాకారులతో పాటు కల్చరల్‌ ఈవెంట్స్‌ ఆర్గనైజర్లు, సన్నాయి, బ్యాండు వాయిద్య కళాకారులు,   పురోహితులు, ఎలక్ట్రీషియన్లు, ట్రాలీ ఆటో, ట్రాక్టర్‌ డ్రైవర్ల ఆదాయానికి  కరోనా గండికొట్టింది.  
∙వ్యాపారాలకు సంబంధించి ప్రధానంగా పూలు, పండ్లు, టపాసులు, రంగులు విక్రయించే వ్యాపారులపై  కరోనా ప్రభావం చూపనుంది. మండపాల్లో కొలువుదీర్చే స్వామివారి విగ్రహానికి ప్రతిరోజు గజమాల వేస్తారు. అయితే కరోనా కారణంగా  విగ్రహాలను ఏర్పాటు చేయక పోవడం వల్ల  జిల్లా వ్యాప్తంగా ఉన్న పూల వ్యాపారులు దాదాపు రెండుకోట్ల రూపాయిల మేర వ్యాపారాన్ని  కోల్పోవాల్సివస్తుంది.  ఫలితంగా చవితి ఉత్సవాల సందర్భంగా జరిగే అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి రూ.10 కోట్లకు పైగా వ్యాపారానికి గండి పడనుంది.  

రూ.15 లక్షలకు పైగా ఆదాయాన్ని కోల్పోనున్న ట్రాన్స్‌కో... 
 విగ్రహాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు మండపాల్లో, విద్యుత్‌ అలంకరణకు తాత్కాలికంగా విద్యుత్‌ కనెక్షన్‌  తీసుకోవాల్సి ఉంది. దీని వల్ల గత ఏడాది జిల్లాలో ఉన్న ఆరు రెవెన్యూ డివిజిన్ల పరిధిలో  ట్రాన్స్‌కోకు రూ.14 లక్షలకు పైబడి ఆదాయం వచ్చింది.   ఈ ఏడాది  దాదాపు రూ. 15 లక్షలకు పైగా విద్యుత్‌శాఖకు ఆదాయం వచ్చేది.  అయితే ఈ ఏడాది  విగ్రహాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున ట్రాన్స్‌కో రూ.15 లక్షలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 

రెండు నెలలు ఇంటి ఖర్చులకు వచ్చేది.. 
వినాయక చవితి ఉత్సవాల్లో నేను దాదాపు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తాను. ఆ వచ్చే డబ్బులు  రెండు నెలలు ఇంటి ఖర్చులన్నింటికీ సరిపోయేది. కరోనా తగ్గలేదు. ఏం చేద్దాం . 
– సుబ్బరామయ్య, బ్యాండ్‌ వాయిద్య కళాకారుడు, రాజంపేట 

ఎంతో ఆశ పెట్టుకున్నా.. 
కరోనా వల్ల ఆరు నెలల నుంచి సరైన ఆదాయం లేదు. వినాయక చవితి సమయానికి కరోనా తగ్గుతుంది, నాలుగు గిరాకీలు వస్తాయి,  అంతో ఇంతో వచ్చే డబ్బులతో  చేతిబదులుగా తీసుకున్న అప్పులైనా తీర్చుదామనుకొని ఉత్సవాలపై ఎంతో ఆశ పెట్టుకున్నా. కరోనా చూస్తే ఇట్టే ఉంది. ఎవరూ విగ్రహాలు పెట్టడం లేదు.   
 – సుధాకర్, సన్నాయి వాయిద్య కళాకారుడు, రాజంపేట 

ఖర్చులు పోను లక్ష రూపాయిలు మిగిలేవి... 
ఉత్సవాల్లో మాకు మంచి డిమాండ్‌ ఉంటుంది. చాలా మంది కనీసం రెండు నెలల ముందే ప్రోగ్రామ్స్‌కు అడ్వాన్స్‌లు కూడా ఇస్తారు.  ఉత్సవాలు ముగిసే సరికి నాకు ఖర్చులన్నీ పోను దాదాపు లక్ష రూపాయలు మిగులుతుంది. ఈ ఏడాది కరోనా వల్ల లక్ష  ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. 
– సుమన్, ఈవెంట్స్‌ ఆర్గనైజర్, ప్రొద్దుటూరు 

అన్ని రోజులు ప్రోగ్రామ్స్‌ ఉండేవి... 
తొమ్మిది రోజుల పాటు జరిగే చవితి ఉత్సవాల్లో అన్ని రోజులు నాకు ప్రోగ్రామ్స్‌ ఉండేవి. చవితి ఉత్సవాల సందర్భంగా కళాకారులకు  బాగా డిమాండ్‌ ఉంటుంది. ఇందువల్ల ఆర్గనైజర్లు డబ్బులు బాగా ఇస్తారు. నాకు చవితి ఉత్సవాల్లో రూ.50 వేల వరకు వస్తుంది. ఈఏడాది విగ్రహాలు పెట్టనందున ఆదాయం పోయినట్టే. 
–  జ్యోతి, స్టేజీ యాంకర్, కడప   

మరిన్ని వార్తలు