Corona: చిన్న ఊరు.. నిశ్చింతగా ఉన్నారు

5 May, 2021 03:34 IST|Sakshi
సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న యువత

కరోనా కట్టడికి నడుంబిగించిన గుంటూరు జిల్లా ఉప్పరపాలెం యువత 

ఒక్క కేసూ రాకుండా అడ్డుకుని ఆదర్శంగా నిలిచిన పల్లె 

వినుకొండ (నూజెండ్ల): ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లాడుతుంటే.. గుంటూరు జిల్లా వినుకొండకు ఆనుకుని ఉన్న చిన్న పల్లెటూరు మాత్రం నిశ్చింతగా ఉంటోంది. ఆ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా రహిత గ్రామంగా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు.

గ్రామస్తులు, యువత, అధికారులు కలిసికట్టుగా కట్టడి చర్యలు చేపట్టడమే దీనికి కారణం. వినుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపాలెంలో 4 వేల జనాభా ఉన్నారు. సర్పంచ్‌ గోపు కృష్ణ ఆధ్వర్యంలో యువత కమిటీలుగా ఏర్పడి ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బయటి నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎవరికి వారు స్వచ్ఛందంగా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ 
ఉప్పరపాలెం గ్రామంలో ఎక్కువగా వలస కూలీలు ఉన్నారు. ఆ గ్రామం వినుకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలో కరోనాపై అవగాహన సదస్సులతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. ఇకపై కూడా ఎలాంటి కేసులు రాకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాం. 
– వేముల వెంకట శివయ్య, ఎంపీడీవో

యువత సహకారంతో.. 
కరోనా కట్టడికి గ్రామంలోని యువత అంతా కమిటీలుగా ఏర్పడి నడుం బిగించారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయిస్తున్నాం. రేషన్, పింఛన్‌ పంపిణీ సమయాల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించడం వల్ల వైరస్‌ కట్టడి సాధ్యమైంది. ఇకపై కూడా ఎలాంటి కేసులూ రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నాం.
    – గోపు కృష్ణ, సర్పంచ్‌  

మరిన్ని వార్తలు