రాజమండ్రి జైల్లో ఖైదీలకు కరోనా

10 Apr, 2021 04:02 IST|Sakshi

22 మందికి పాజిటివ్‌

అప్రమత్తమైన జైళ్ల శాఖ.. ప్రత్యేక చర్యలు

జైలుకు వచ్చే ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్ష తప్పనిసరి

పాజిటివ్‌ వస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చికిత్స  

సాక్షి, అమరావతి: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో నెల రోజుల్లో 22 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో జైళ్ల శాఖ అప్రమత్తమై.. ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 81 జైళ్లలో 7,090 మంది ఖైదీలున్నారు. వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కోవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైలుకు వచ్చే కొత్త ఖైదీలకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన వారినే జైలులోకి అనుమతిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. జైలు రికార్డుల్లో నమోదు చేసి వారిని వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. బ్యారక్‌లలో తక్కువ మందిని ఉంచుతున్నారు. అల్పాహారం, భోజన సమయాల్లో అందర్నీ ఒకేసారి వదలకుండా పది మంది చొప్పున జైలు ఆవరణలో విడిచిపెడుతున్నారు. బ్యారక్‌ లోపల, జైలు ఆవరణలోనూ ఖైదీలు భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. ఖైదీలకు అవసరమైన మాస్కులను జైళ్లలోనే తయారు చేస్తున్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం..
రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఇప్పటివరకు 150 మందికిపైగా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కానీ, కరోనా వల్ల ఏ ఒక్క ఖైదీ కూడా చనిపోలేదు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌లో రాజమండ్రి కాకుండా.. పలు జైళ్లలో ఉన్న ఆరుగురు ఖైదీలకు కరోనా సోకినట్టు ఇప్పటి వరకు రిపోర్టు వచ్చింది. కరోనా సోకిందని నిర్ధారణ కాగానే జైలుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాం. ఖైదీ కోలుకున్న అనంతరం ప్రత్యేక బ్యారెక్‌లో పెట్టి వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. 
– జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్థన్‌

వారంతా కోలుకున్నారు..
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో గత నెల రోజుల్లో 22 మందికి కరోనా సోకింది. బయటి నుంచి వచ్చిన ముగ్గురు రిమాండ్‌ ఖైదీల వల్ల అదే బ్యారెక్‌లో ఉన్న మిగిలిన వారికి కరోనా వ్యాపించింది. వారిని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. వారిని ప్రత్యేక బ్యారెక్‌లో పెట్టి పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం ఖైదీలకు ఎలాంటి ఇబ్బందిలేదు. 
– రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ శ్రీరామ రాజారావు 

మరిన్ని వార్తలు