పెరుగుతున్న రికవరీ! 

26 Aug, 2020 12:49 IST|Sakshi

కోవిడ్‌ నియంత్రణకు పటిష్ట వ్యూహం 

జిల్లాలో మొత్తం పరీక్షలు 1,53,012 

ఇప్పటివరకు నమోదైన కేసులు 17,002 

వ్యాధినుంచి కోలుకున్న వారు 9,470 

చికిత్స పొందుతున్న వారు 7,419  ∙కోవిడ్‌ నియంత్రణకు పటిష్ట వ్యూహం

కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికబద్ధమైన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో రికవరీ శాతం పెరుగుతోంది. పరీక్షలు అధికంగా చేయడం వల్ల కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ.. డిశ్చార్జ్‌లు కూడా పెరుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నవారు వారంలోనే రికవరీ అవుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 17,002 కేసులు నమోదు కాగా.. వీరిలో 9,470 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 7,419 మంది వివిధ ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మరణాలు కూడా జిల్లాలో తక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకూ 113 మంది ప్రాణాలు కోల్పోయారు.  

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆదినుంచి విజయనగరం జిల్లా ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోకి వ్యాధి ప్రవేశించినప్పటికీ, సుమారు 48 రోజుల పాటు  జిల్లా గ్రీన్‌ జోన్‌లో నిలిచింది. అయితే వలస కార్మికులు, ఇతర ప్రాంతాల వారినీ అనుమతించారో.. వారితో పాటే కరోనా వైరస్‌ జిల్లాలోకి ప్రవేశించింది. వలస కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి  వచ్చేవారిని 14 రోజులు విడిగా ఉంచేందుకు జిల్లాలో 124 క్వారంటైన్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 15,223 మందికి వసతి కల్పించారు. అయినప్పటికీ అక్కడక్కడా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించగలిగారు. ఇప్పటి వరకు జిల్లాలో వెరీ యాక్టివ్, యాక్టివ్‌ తదితర 230 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టారు. పకడ్బందీగా సర్వేలైన్స్‌ విధానాన్ని అమలు చేసి, విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రైమరీ కాంటాక్టులు, సెకండరీ కాంట్రాక్టులు తదితర 1,97,499 మందిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వైద్య  పరీక్షలను నిర్వహించారు.  

రోజూ 4 వేల మందికి పరీక్షలు..  
జిల్లాలో కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ (త్రిబుల్‌ టీ) విధానం ద్వారా ప్రత్యేక వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు సుమారు నాలుగు వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 1,53,012 మందికి పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా 30,367, ట్రూనాట్‌ ద్వారా 49,390, ర్యాపిడ్‌ ఏంటిజన్‌ టెస్టులు ద్వారా 73,255 మందికి పరీక్షలు చేశారు.  

వైద్యంతో పాటు కౌన్సెలింగ్‌   
కరోనా వ్యాధి నిర్ధారణ అయిన వారికి మూడు రకాల చికిత్సను అందిస్తున్నారు. వ్యాధి లక్షణాలు  తీవ్రంగా ఉండి, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నవారిని, ఆస్తమా, గుండె జబ్బు, సుగర్, బీపీ తదితర ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని, 60 ఏళ్లు పైబడిన వారిని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా నిర్ధారణ అయినప్పటికీ ఎటువంటి లక్షణాలు లేనివారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచుతున్నారు. లక్షణాలు లేనివారిని, రిస్క్‌ తక్కువుగా ఉన్నవారిని ఇళ్లలో విడిగా ఉండేందుకు అవకాశం ఉంటే అలాంటి వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి వైద్య చికిత్సను అందించడంతో పాటు రోజూ కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ప్రత్యేక వైద్య బృందాలు  పనిచేస్తున్నాయి. కోవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లలో ఉన్నవారు త్వరగా వ్యాధి నుంచి కోలుకొనేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం బలమైన పౌష్టికాహారం అందిస్తున్నారు.  

2,600 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు  
వ్యాధి లక్షణాలు పెద్దగా లేనివారిని ఉంచేందుకు జిల్లాలో 5 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో విజయనగరంలోని జేఎన్‌టీయూలో 1600, ఎంవీజీఆర్‌లో 400, గరుగుబిల్లి ఉద్యాన కళాశాలలో 400, పి.కోనవలసలో 100, ఎస్‌.కోటలో 100 పడకలతో కేర్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కేర్‌ సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 3,332 మంది డిశ్చార్జ్‌ కాగా 866 మంది చికిత్స పొందుతున్నారు. ఇవికాకుండా 530 పడకలతో గొట్లాం గాయిత్రి కళాశాలలో రెండు, విజయనగరం ఎంఆర్‌పీజీ కళాశాలలో ఒక కేర్‌ సెంటర్‌ను సిద్ధంగా ఉంచారు. అవసరం మేరకు నియోజకవర్గానికి ఒక కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. 

9 ఆస్పత్రుల్లో చికిత్స  
జిల్లాలో తొమ్మిది ఆస్పత్రుల ద్వారా కోవిడ్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స జరుగుతోంది. విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రి, సాయి సూపర్‌ స్పెషాలిటీ, తిరుమల, పుష్పగిరి, క్వీన్స్‌ ఏఆన్‌ఆర్‌ఐ, గాయిత్రి, వెంకటరామా ఆస్పత్రులు, నెల్లిమర్ల మిమ్స్, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రుల్లో మొత్తం 1445 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వెంటిలేటర్లతో కూడిన బెడ్స్‌ 79, ఐసీయూ 168, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకలు 364 ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ ఆస్పత్రుల్లో 828  మంది చికిత్స పొందుతుండగా..  382 మంది వైద్యులు, 1186 మంది నర్సింగ్, పారా మెడికల్‌ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ప్రతీ కోవిడ్‌ ఆస్పత్రిని ఒక నోడల్‌ అధికారి, వైద్యాధికారి పర్యవేక్షిస్తున్నారు.  

మరిన్ని వార్తలు