ఏపీ: మాస్క్‌ లేకుండా తిరిగితే కఠిన చర్యలు

31 Jul, 2021 20:39 IST|Sakshi

మాస్క్‌ లేకుండా రానిచ్చే సంస్థలకు 10 వేల నుంచి 25వేల వరకు జరిమానా

ఆంక్షలు ఉల్లంఘించే వారి ఫొటోలు 80109 68295కు వాట్సాప్‌ చేయాలి

ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని, అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని ఆయన వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు  తెలిపారు.

ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కమిషనర్‌ హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు