కరోనా నుంచి కోలుకున్నా.. ఈ సమస్యలు వెంటాడొచ్చు!

8 Apr, 2021 04:38 IST|Sakshi

కరోనా బాధితులకు నరాల, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు 44 శాతం అధికం

శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం 16 శాతం అధికం

17 శాతం మందిలో మానసిక సమస్యలు

2 శాతం మందికి చిత్త వైకల్యం కూడా..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

సాక్షి, అమరావతి: ‘కరోనా బారినపడి కోలుకున్న తరువాత కూడా వివిధ అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంది. కాబట్టి కరోనా బాధితులు వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది’ అని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా నరాల సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. కరోనా నుంచి కోలుకున్న 2,36,379 మంది ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ నివేదికను వెల్లడించింది. ప్రఖ్యాత ‘లాన్సెట్‌ సైకియాట్రి’ జర్నల్‌ ప్రచురించిన ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

మూడోవంతు మందికి..
► కరోనా నుంచి కోలుకున్న వారిలో మూడోవంతు మంది నరాల సంబంధిత, మానసిక రుగ్మతల బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఫ్లూ వంటి ఇతర వ్యాధుల నుంచి కోలుకున్న వారితో పోలిస్తే కరోనా బాధితులు ఈ రెండు సమస్యల బారిన పడే అవకాశాలు 44 శాతం అధికం. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 16 శాతం అధికం.
► అధ్యయనం చేసిన 2,36,379 మందిలో 1,05,579 మంది ఇన్‌ప్లూయెంజా వైరస్, 2,36,038 మంది శ్వాసకోశ నాళంలో ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డారు. వీరిలో 17 శాతం మంది మానసిక రుగ్మతలతో, 14 శాతం మంది ఒత్తిడితో సతమతం అవుతున్నారు.
► వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో 7 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. 2 శాతం మంది మానసిక వైకల్య సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఇలా కావడానికి ప్రధాన కారణం ఏమిటన్నది కచ్చితంగా నిర్ధారించనప్పటికీ.. మానసిక ఆందోళన, ఉద్యోగ భద్రత లేకపోవడం, దీర్ఘకాలం క్వారంటైన్‌లో ఒంటరిగా ఉండటం మొదలైనవి ప్రాథమిక కారణాలుగా అంచనా వేశారు. వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నివేదిక పేర్కొంది. వీరికి సామాజిక భద్రత, సంరక్షణ కల్పించడం, మేమున్నామనే భరోసా ఇవ్వడం ద్వారా ఆ సమస్యల నుంచి వారిని బయటపడేయవచ్చని నివేదిక అభిప్రాయపడింది. 

మెదడుపై కరోనా ప్రభావం ఎంత!
మెదడుపై కరోనా ప్రభావంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తన నివేదికలో పేర్కొంది. లండన్‌లో కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో చేరిన ప్రతి ఐదు మందిలో నలుగురికి తలనొప్పి, మైకం, కండరాల నొప్పి తదితర లక్షణాలు కనిపించాయి. ఈ వైరస్‌ మొదటిసారిగా బయటపడిన చైనాలోని వూహాన్‌లో 36 శాతం కరోనా రోగుల్లో నరాల సంబంధ సమస్యలు, మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపించాయని నివేదిక తెలిపింది.  

మరిన్ని వార్తలు