ఆ కుటుంబానికి కరోనా మంచే చేసింది

30 Jan, 2021 08:16 IST|Sakshi

కరోనా నేర్పిన బతుకు పాఠం

స్వశక్తికి స్వయం ఉపాధి ‘తోడు’ అయ్యింది 

కుటుంబాలను చిదిమేసిన కరోనా లాక్‌డౌన్‌   

కుటీర పరి‘శ్రమ’తో కుటుంబ పోషణ  

ఆధునిక ఆలోచనలతో ఎందరికో ఆదర్శం  

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా.. లాక్‌డౌన్‌ కాలంలో బతుకుపాఠాలను నేరి్పంది. స్వశక్తిగా ఎదిగి, ఆత్మస్థైర్యంతో ఎలా బతకాలో అన్నీ నేరి్పంది. ఎవరో వస్తారు.. ఏదో సాయం చేస్తారని ఎదురు చూడకుండా  స్వశక్తి స్వయం ఉపాధి మార్గాలను చూపింది. వారి నూతన ఆలోచనలు ఆ ప్రాంతానికి కొత్త కుటీర పరిశ్రమలను పరిచయం చేశాయి. తాము కూడబెట్టుకున్న డబ్బు ఇంటి వద్దనే చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటు చేసుకుని మరికొన్ని కుటుంబాలకు ఉపాధి కలి్పస్తున్నారు నల్లమాడ వాసులు.  

నల్లమాడ/అనంతపూర్‌: కరోనాకు ముందు.. కరోనా తర్వాత.. ఇక నుంచి ప్రతీదీ ఇలాగే ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నిరూపించారు నల్లమాడ వాసులు. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం దగ్గర్నుంచి.. ఆర్థిక భరోసా కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలాంటివన్నీ ఆచరణలో పెట్టి విజయం సాధించారు. కరోనా నిరోధానికై విధించుకున్న లాక్‌డౌన్‌ వల్ల సమస్యలు ఎదుర్కొన్నా.. ఆత్మస్థైర్యంతో జీవించే విధానాలను ఈ మహమ్మారి నేర్పిందనేది అక్షర సత్యమని నిరూపించారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేసుకున్నారు.  

కరోనా వల్ల మూతపడ్డ చిరు వ్యాపారం.. 
నల్లమాడకు చెందిన వెంకటనారాయణ, కృష్ణవేణి దంపతులకు హరీష్‌కుమార్, సాయికిరణ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో హరీష్‌కుమార్‌ సీఏ (చార్టెడ్‌ అకౌంటెన్సీ) కోర్సు చేస్తున్నాడు. సాయికిరణ్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నల్లమాడ బస్టాండ్‌ కూడలిలో కృష్ణవేణి దంపతులు ఓ చిన్నపాటి టిఫెన్‌ సెంటర్‌ నడుపుతూ వచ్చే డబ్బుతో పిల్లలను చదివించుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది మార్చి నుంచి హోటల్‌ కాస్త మూతపడింది. రోజులు.. నెలల తరబడి ఇంటి పట్టునే ఖాళీగా ఉండిపోయారు. పైసా ఆదాయం లేకపోవడంతో కుటుంబపోషణ, పిల్లల చదువులు భారమయ్యాయి.  

బతుకుపాఠం నేర్పిన కోవిడ్‌–19.. 
హోటల్‌ మూతపడి కృష్ణవేణి దంపతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడసాగారు. పిల్లల చదువుల కోసం ఏదో ఒక పని చేయాలని కృష్ణవేణి భావించింది. పలు రకాలుగా ఆలోచించించి చివరకు తమిళనాడులోని ధర్మపురిలో తమకు తెలిసినవారు డోర్‌ మ్యాట్‌లు తయారు చేస్తుండడం గుర్తుకొచ్చి, వెంటనే వారిని ఫోన్‌లో సంప్రదించింది. తన పరిస్థితి మొత్తం వారికి వివరించి, తాను కూడా మ్యాట్‌లు తయారు చేయడం నేర్చుకుంటానని, ఇందుకు సహకరించాలని అభ్యరి్థంచింది. వారు అంగీకరించడంతో వెంటనే ధర్మపురికి వెళ్లి పది రోజుల పాటు అక్కడే ఉండే మ్యాట్‌ల తయారీపై శిక్షణ పూర్తి చేసుకుని వచ్చింది.   

నల్లమాడలో కుటీర పరిశ్రమ ఏర్పాటు.. 
మ్యాట్‌ల తయారీకి అవసరమైన రెండు యంత్రాలను తమిళనాడు నుంచి తెప్పించుకున్న కృష్ణవేణి... స్థానిక కుటాలపల్లి రహదారిలో ఓ షెడ్‌ అద్దెకు తీసుకొని మూడు నెలల క్రితం కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసింది. ముడిసరుకు (టెంకాయ తాళ్లను)ను సైతం తమిళనాడు నుంచే దిగుమతి చేసుకొని వాటికి రంగులు అద్ది మ్యాట్‌లు తయారీ చేయడం మొదలు పెట్టింది. ఈ మొత్తం యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు ఆమె పెట్టుబడి పెట్టారు. భార్య ఆలోచనను ప్రోత్సహిస్తూ వచ్చిన భర్త వెంకటనారాయణ..ఆమె తయారు చేసిన మ్యాట్‌లను మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించడం మొదలు పెట్టాడు. పని భారం పెరగడంతో మరో నలుగురు మహిళలకు కృష్ణవేణి ఉపాధి కలి్పస్తూ వస్తోంది. ఒక్కొక్కరికి రోజూ రూ.200 చొప్పున కూలి చెల్లిస్తోంది. దీంతో ఉత్పత్తి మరింత పెరగడంతో వ్యాపారాన్ని పొరుగు జిల్లాలకు విస్తరింపజేశారు. జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి, పుట్టపర్తి, ఓడీ చెరువుతోపాటు వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతాల్లోని రిటైల్‌ దుకాణాలకు మాట్‌లను సరఫరా చేసే స్థాయికి ఎదిగారు.   

పేపర్‌ ప్లేట్ల తయారీతో ఉపాధి 
ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లికి చెందిన ఎస్‌.వన్నప్ప నల్లమాడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా పేపర్‌ ప్లేట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వన్నప్ప కుమార్తెకు స్థానిక సచివాలయంలో ఉద్యోగం రావడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు ఏడాది క్రితం కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఖాళీగా ఇంటిపట్టున ఉండలేక రూ.2 లక్షల పెట్టుబడితో పేపర్‌ ప్లేట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసుకున్నారు.  

కరోనా మంచే చేసింది 
కరోనా మాకు మంచే చేసింది. హోటల్‌ మూతపడడంతో కొంత కాలం ఇబ్బందులు పడింది వాస్తవమే. ఇదే ఈ రోజు మమ్మల్ని కుటీర పరిశ్రమ నిర్వహించే స్థాయికి ఎదిగేలా చేసింది. మరో నాలుగు కుటుంబాలకు ఉపాధి కలి్పంచే స్థాయికి మమ్మల్ని ఎదిగేలా చేసిన కరోనాకు థ్యాంక్స్‌. టెంకాయ తాడుతో తయారు చేసే మ్యాట్‌లు ఎక్కువ కాలం మన్నుతాయి. రిటైల్‌గా రూ.100కు, హోల్‌సేల్‌గా అయితే రూ.80తో విక్రయిస్తున్నా. పరిశ్రమ ఏర్పాటు చేసుకొని మూడు నెలలే అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే లాభనష్టాల గురించి బేరీజు వేయలేను.  
– కృష్ణవేణి, నల్లమాడ 

మరిన్ని వార్తలు