మరింత పెరగనున్న టెస్టుల సామర్థ్యం

9 Oct, 2020 02:17 IST|Sakshi

ప్రస్తుతం రోజుకు 70 వేలకు పైగా టెస్టులు

ఇందులో 35వేల ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు

నేటి నుంచి మరో 10వేలు అదనంగా పరీక్షలు

గతంతో పోల్చితే భారీగా తగ్గిన కిట్‌ల ధరలు 

ఎప్పటికప్పుడు తక్కువ ధరకు కొనుగోళ్లు

సాక్షి, అమరావతి: కరోనా ఓవైపు తగ్గు ముఖం పడుతున్నప్పటికీ మరోవైపు టెస్టుల సంఖ్యను పెంచడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో గోల్డెన్‌ స్టాండర్డ్‌గా చెప్పుకునే ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం రోజుకు 35 వేల వరకూ ఆర్టీపీసీఆర్‌–కోవిడ్‌ నిర్ధారణ టెస్ట్‌లు చేస్తున్నారు. కానీ 9వ తేదీ నుంచి 10వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు అదనంగా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీపీఆర్‌ టెస్ట్‌లే రోజుకు 45వేలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ల్యాబొరేటరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

  • ఇప్పటివరకూ ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు సమయం 6 గంటల వరకూ పడుతోంది. ఇప్పుడు ఫ్రీ ఫిల్డ్‌ ట్యూబ్‌ (ముందుగానే రసాయనాలతో నింపిన ట్యూబ్‌)లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.  
  • తొలుత ప్రైవేట్‌ ల్యాబొరేటరీల్లో టెస్ట్‌ ధర రూ.2,800 ఉండేది. ఇప్పుడు దీన్ని రూ.1,900కు తగ్గించారు. మార్కెట్లో రేట్లను బట్టి ఎప్పటికప్పుడు టెండర్లను పిలుస్తూ తగ్గిన ధరల ప్రకారం కిట్‌లను కొనుగోలు చేయడం వల్ల పెద్ద మొత్తం నిధులు ఆదా అయ్యాయి. 
  • రాష్ట్రంలో రోజుకు 70వేల టెస్టులు తగ్గకుండా చేస్తున్నారు. ఇందులో 35వేలు ఆర్టీపీసీఆర్‌ కాగా మిగతావి ట్రూనాట్, యాంటీజెన్‌ టెస్టులున్నాయి. యాంటీజెన్‌లో పాజిటివ్‌ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్‌కు వెళ్లేవారు. అందుకే ఇకపై యాంటీజెన్‌ తగ్గించి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచుతున్నారు.  

మార్కెట్‌లో రేట్లను బట్టి ఎప్పటికప్పుడు.. 
కరోనా నిర్ధారణ పరీక్షలకు కిట్‌లు తొలుత చాలా ఖరీదు ఉండేవి. రానురాను ధరలు తగ్గాయి. దీంతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ రేట్లను బట్టి టెండర్లను పిలిచి కొనుగోలు చేశాం. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ల్యాబొరేటరీలను మరింత మౌలికంగా తీర్చిదిద్దాం. 
– డా.ఎ.మల్లికార్జున, ల్యాబొరేటరీల నిర్వహణాధికారి, ఆరోగ్యశ్రీ సీఈఓ  

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కిట్‌ ధరలు: 
కేటగిరీ           ఏప్రిల్‌–మే          సెప్టెంబర్‌ తర్వాత 
ఆర్టీపీసీఆర్‌       రూ.2,000        రూ.850 
ట్రూనాట్‌          రూ.1,850        రూ.1,050 
యాంటీజెన్‌      రూ.450            రూ.375 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు