చెన్నైలో థర్డ్‌వేవ్‌కు అవకాశం!

10 Jul, 2021 11:55 IST|Sakshi
పబ్లిక్‌ హెల్త్‌ ట్రస్ట్‌ (ఢిల్లీ) చైర్మన్‌ డాక్టర్‌ కే శ్రీనాథరెడ్డి

ఆగస్టు నుంచే ప్రజల్లో లక్షణాలు 

 పబ్లిక్‌ హెల్త్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ శ్రీనాథరెడ్డి 

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోని ఐదు మెట్రో నగరాలను కరోనా థర్డ్‌ వేవ్‌ తాకే అవకాశం ఉందని పబ్లిక్‌ హెల్త్‌ ట్రస్ట్‌ (ఢిల్లీ) చైర్మన్‌ డాక్టర్‌ కే శ్రీనాథరెడ్డి హెచ్చరించారు. ఆ ఐదు మెట్రో నగరాల్లో చెన్నై కూడా ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ వేయడంలో వేగం పెంచకుంటే ప్రమాదమని ఓ ప్రైవేట్‌ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం గణనీయంగా తగ్గినా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని చెప్పారు.

చెన్నైతోపాటు ఢిల్లీ, ముంబయి, బెంగళూ రు, హైదరాబాద్‌ మెట్రో నగరాలను కరోనా థర్డ్‌వేవ్‌ తీవ్రంగా తాకగలదని వైద్య నిపుణులు అంచనా వేశారు. ప్రజల్లో ఆగస్టు నుంచే థర్డ్‌వేవ్‌ లక్షణాలు కనిపించే అవకాశం ఉందన్నారు. ‘అక్టోబర్‌ లేదా నవంబరులో తలెత్తే ఈ థర్డ్‌వేవ్‌ ఎంతవరకు అపాయకరమనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నా యి. కరోనా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాలు మందకొడిగా సాగడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాలేదు.దేశవ్యాప్తంగా కనీసం రోజుకు ఒక కోటి మందికి వ్యాక్సిన్‌ వేయాల్సిన ఆవశ్యకత ఉంది.

కరోనా రూపుమార్చుకుని డెల్టా ప్లస్‌ గా చెన్నైతోపాటు దేశంలోని ఐదు మెట్రోనగరాల్లో విజృంభిస్తోంది. థర్డ్‌వేవ్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్‌ ప్రక్రియ ను వేగంగా పూర్తి చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం...ఈ రెండే మార్గాలు. వ్యాక్సినేషన్‌ ప్రక్రి య జనవరిలో ప్రారంభమైనా ఇంకా అనేక రాష్ట్రాలు కొరతతో అవస్థలు పడుతున్నాయి. 60 నుంచి 70 శాతం ప్రజానీకానికి వ్యాక్సిన్‌ వేయడం పూర్తయినప్పుడే ప్రజల్లో కరోనా భయం తొలగిపోతుంది.

రెండు డోసులకు మధ్య వ్యవధిని 12 వారా ల నుంచి 16 వారాల వరకు పెంచినందున ఆయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవధి ఎక్కువైతే వ్యాక్సిన్‌ ప్రభావం తరిగిపోతుందని పరిశోధనల్లో తేలింది. బ్రిటన్‌ తదితర దేశాల్లో వ్యాక్సిన్‌ వ్యవధిని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించారు. ఆ దేశాల అనుభవంతోనైనా 45 ఏళ్లు పైబడిన వారికి రెండునెలల వ్యధిలో రెండు డోసులూ పూర్తి చేయాలి.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 36 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే వేశారు. ఈ ఐదు మెట్రోనగరాల్లో జన రద్దీ ఎక్కువగా ఉండడం వల్లనే కరోనా ఫస్ట్, సెకెండ్‌ వేవ్‌ల సమయంలో భారీగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఈ ఐదు నగరాల్లో వ్యాక్సిన్‌ వేగం పెంచడం ద్వారా థర్డ్‌ వేవ్‌ను కట్టడి చేయవచ్చని’ శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. 

మరిన్ని వార్తలు