తొలిరోజు 19,108 మందికి

17 Jan, 2021 03:23 IST|Sakshi
గుంటూరు బొంగరాలబీడు పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంకు వ్యాక్సిన్‌ వేస్తున్న వైద్యులు

రాష్ట్రంలో లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్‌ 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14,300 మాత్రమే 

వ్యాక్సిన్‌ ప్రక్రియలో తొలి స్థానంలో యూపీ, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

వ్యాక్సిన్‌ కేంద్రాల సంఖ్యలో దేశంలో మొదటిస్థానం  

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,274 మందికి.. 

అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 436 మందికి టీకా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. శనివారం 19,108 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14,300 మాత్రమే. ఈ లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం కొనసాగింది.

విజయవాడ సర్వజనాసుపత్రిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, మంత్రులు, కలెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం రాత్రి వరకూ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,274 మందికి, అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో 436 మందికి వ్యాక్సిన్‌ వేశారు. రాష్ట్రంలో 3.87 లక్షల మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకా ఇవ్వడం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని, నోడల్‌ అధికారి డా.శ్రీహరి, డా.హైమావతి తదితరుల బృందం వ్యాక్సిన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. 

వ్యాక్సిన్‌ ప్రక్రియలో దేశంలో అగ్రగామిగా..
► దేశంలో కరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలా ముందంజ వేసిందో వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియలోనూ దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. 
► దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,291 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వేసిన వారి సంఖ్య (19,108 మంది) చూస్తే ఏపీలో అత్యధికం. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 21 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు.
► ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 13,594 మందికి, మహారాష్ట్రలో 18,328 మందికి వ్యాక్సిన్‌ వేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో ఏ ఒక్కరికీ కూడా దుష్ప్రభావాలు కలగలేదు.  

>
మరిన్ని వార్తలు