ఒక్కరోజే 25,126 మందికి వ్యాక్సిన్‌

21 Jan, 2021 03:50 IST|Sakshi

నాలుగు రోజుల్లో ఇదే అత్యధికం

ఇప్పటివరకూ 91,331 మందికి టీకా

వ్యాక్సినేషన్‌ కేంద్రాలు 332 నుంచి 601కి పెంపు

సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 25,126 మందికి వ్యాక్సిన్‌ వేశారు. అత్యధికంగా వైఎస్సార్‌ జిల్లాలో 2,574 మంది వ్యాక్సిన్‌ పొందారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1,027 మందికి వేశారు. ఇవన్నీ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాగా.. కృష్ణా జిల్లాలోని  కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తొలిసారిగా భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వేశారు. రాష్ట్రంలో 3,88,327 మంది వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకోగా.. ఇప్పటివరకూ రాష్ట్రంలో 91,331 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 36.85 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

వ్యాక్సిన్‌ కేంద్రాల పెంపు
రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కేంద్రాలను భారీగా పెంచారు. ఈ నెల 19 వరకూ 332 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరిగేది. ఇప్పుడా సంఖ్య 601కి పెరిగింది. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే హెల్త్‌కేర్‌ వర్కర్లు ఉంటారో.. వాళ్లందరికీ అదే కేంద్రంలో టీకా వేసేలా సర్కారు చర్యలు చేపట్టింది.  

మరిన్ని వార్తలు