‘పంచాయతీ’ అప్పీల్‌పై ముగిసిన వాదనలు

20 Jan, 2021 03:28 IST|Sakshi

వ్యాక్సినేషన్‌ వివరాలను హైకోర్టు ముందుంచిన ఏజీ 

తీర్పు వాయిదా.. నిమ్మగడ్డ తీరును తప్పుపట్టిన ధర్మాసనం 

రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి భాష హుందాగా ఉండాలని హితవు 

ప్రభుత్వ అభిప్రాయాలతో ఏకీభవించ లేకపోతే తిరస్కరించొచ్చని వ్యాఖ్య 

సాక్షి, అమరావతి:  పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ స్పందిస్తూ.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వివరాలను ధర్మాసనం ముందుంచారు. సోమవారం సాయంత్రం వరకు 45 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. రానున్న పది రోజుల్లో 3.7 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్‌ తీసుకోనున్నారని వివరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులు, మునిసిపల్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నామని, వీరి సంఖ్య దాదాపు 7 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 9.6 లక్షల డోసుల వ్యాక్సిన్‌ అందుకుందని, ఇందులో 9.4 లక్షల డోసులను ఓ కంపెనీ, మరో 20 వేల డోసులను మరో కంపెనీ పంపిందని తెలిపారు. 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని వివరించారు. 

ఆ మాటలు తగవు.. 
ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గినందున ఎన్నికలు పెడితే జరిగే హాని ఏముందని ఎస్‌ఈసీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు ప్రశ్నించారు. ఓ రాజ్యాంగ వ్యవస్థను తన రాజ్యాంగ విధులు నిర్వర్తించకుండా నిరోధించే అధికారం న్యాయస్థానాలకు లేదని నిమ్మగడ్డ రమేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. నిమ్మగడ్డ తీరును తప్పు పట్టింది. తన హయాంలో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రమేశ్‌ తన లేఖలో పేర్కొనడాన్ని ఆక్షేపించింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చునని, భాష ఎప్పుడూ హుందాగా ఉండాలని హితవు పలికింది. ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించే పరిస్థితి లేకుంటే, వాటిని సహేతుక కారణాలతో తిరస్కరించవచ్చని, అవసరం లేని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ఈ అప్పీల్‌లో తమను ఇంప్లీడ్‌ చేసుకుని తమ వాదనలు వినాలంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టేసింది.  

>
మరిన్ని వార్తలు