Corona Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా టీకాలు

11 Nov, 2021 04:16 IST|Sakshi

18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల కోవిడ్‌ టీకా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. కరోనా కట్టడికి ప్రధాన అస్త్రమైన టీకా పంపిణీపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేయడం పూర్తయింది.

18 ఏళ్లు పైబడిన వారు 3,95,22,000 మంది ఉండగా వీరిలో 2,17,88,482 మందికి రెండు డోసుల టీకా వేశారు. వీరిలో 45 ఏళ్లు పైబడిన వారు 1,26,49,631 మంది, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది 4,77,590 మంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్లు 15,43,843 మంది ఉన్నారు. 71,17,418 మంది ఇతరులు ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన వారిలో 84.91 శాతం అంటే.. 3,35,59,940 మందికి (రెండో డోసు కూడా వేయించుకున్న వారితో కలిపి) తొలి డోసు పూర్తయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,53,48,422 డోసుల టీకాను ప్రభుత్వం పంపిణీ చేసింది.

అత్యధికంగా నెల్లూరులో
18 ఏళ్లు పైబడిన వారికి అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 63.02 శాతం, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 46.58 శాతం, శ్రీకాకుళంలో 47.80 శాతం మందికి టీకా పంపిణీ పూర్తయింది. మిగిలిన అన్ని జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన 50 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసుల టీకా వేశారు. నవంబర్‌ నెలకు రాష్ట్రానికి 86,81,990 డోసుల టీకా కేటాయించారు. ఇందులో 37,70,620 డోసులు రాష్ట్రానికి వచ్చాయి.

99.01 శాతం రికవరీ రేటు
రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వైరస్‌ సోకి, దాని నుంచి కోలుకొన్న వారు 99.01 శాతం మంది ఉన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 20,68,718 పాజిటివ్‌ కేసులు నమోదవగా, వీరిలో 20,51,082 మంది వైరస్‌ను జయించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో యాక్టివ్‌ కేసుల రేటు 0.16 శాతం మాత్రమే ఉంది. 

మరిన్ని వార్తలు