రెండ్రోజుల్లో సచివాలయాల్లో వ్యాక్సినేషన్

23 Mar, 2021 05:05 IST|Sakshi

రోజుకు 3 లక్షల మంది లక్ష్యం..

ఒక్కో పీహెచ్‌సీ పరిధిలో రోజుకో సచివాలయంలో.. 

ఏఎన్‌ఎం, ఆశా, వలంటీర్ల ద్వారా అర్హుల గుర్తింపు 

మరుసటి రోజు వెంటనే వ్యాక్సిన్‌

సాక్షి, అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పెరిగింది. రెండ్రోజుల్లో గ్రామ/వార్డు సచివాలయాల్లో కోవిడ్‌ టీకా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగు సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించగా మంచి ఫలితాలొచ్చాయి. ఆస్పత్రికి వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవడం కంటే సచివాలయాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడికే ఎక్కువ మంది వచ్చారు. దీంతో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒకసారి తెలియజేసిన అనంతరం దీనిని అమలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రోజుకు కనీసం 3 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సచివాలయాలతో పాటు 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ యథావిధిగా టీకా ప్రక్రియ కొనసాగుతుంది.

1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 10 నుంచి 12 దాకా గ్రామ/వార్డు సచివాలయాలున్నాయి. రోజూ ఓ పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ పరిధిలో ఒక సచివాలయంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపడతారు. వ్యాక్సిన్‌ వేసే ముందురోజే దండోరా, లేదా మైక్‌ అనౌన్స్‌మెంట్లు నిర్వహిస్తారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్లు.. వాక్సిన్‌ వేయాల్సిన వారి ఇళ్లకు వెళ్లి ఆధార్‌ కార్డులు సేకరిస్తారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకే ఈ వివరాలన్నీ కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించి.. ఆపై టీకాలు వేస్తారు. 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఎవరికైనా మెడికల్‌ సర్టిఫికెట్‌ లేకుంటే స్థానిక మెడికల్‌ ఆఫీసరే సర్టిఫై చేస్తారు. 

రెఫరల్‌ యూనిట్‌గా 104
కోవిడ్‌ టీకా వేయించుకున్న వారికి ఏదైనా దుష్ప్రభావాలు కలిగితే రెఫరల్‌ యూనిట్‌గా 104 వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర రవాణా కోసం 108 వాహనాలనూ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి కేంద్రం వద్ద పేర్ల నమోదుకు కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్‌నెట్, స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. శాచ్యురేషన్‌ పద్ధతిలో అంటే.. పైన పేర్కొన్న వయసుల వారు గ్రామ/వార్డు సచివాలయంలో ఎంతమంది ఉన్నారో అందరికీ టీకాలు వేసేలా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు