రూ.2,937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్

28 Feb, 2021 03:39 IST|Sakshi

ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి 

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని తీర్మానం 

టీటీడీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్‌ 

శ్రీవారి మెట్టు మార్గంలో నడిచివచ్చే భక్తులకు అన్నప్రసాదం  

అయోధ్యలో శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా వసతి సముదాయం 

త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ  

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి  

తిరుమల: 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,937.82 కోట్ల అంచనాలతో టీటీడీ బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిందని బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ముందస్తు రిజర్వేషన్‌తో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. వీరు సేవకు వచ్చే మూడ్రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్‌ సమర్పించాలి. అలాగే, టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని నిర్ణయించామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలివీ.. 
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

► 2021–22 టీటీడీ బడ్జెట్‌ రూ.2,937.82 కోట్లుగా ధర్మకర్తల మండలి ఆమోదించింది. 
► గుడికో గోమాత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందనతో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తులాభారం ప్రవేశపెట్టేందుకు ఆమోదం. 
► టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధివిధానాలను నిర్ణయించారు. 
► టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం. 
► టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మారుస్తారు. బర్డ్‌ ఆసుపత్రిలో పీడియాట్రిక్‌ విభాగం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు రూ.9 కోట్ల మంజూరుకు ఆమోదం.  
► తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. అలాగే, తిరుమలలో క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం. 
► శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అన్నప్రసాదం ఇవ్వాలని నిర్ణయం. అయోధ్యలో రామ మందిరం వద్ద భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం, యాత్రికుల వసతి సముదాయం.. వీటిలో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయించారు. సమావేశంలో ఈవో జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శివకుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు