రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం

29 Jun, 2021 03:14 IST|Sakshi

5,515 సచివాలయాల పరిధిలో జీరో పాజిటివ్‌లు

ఒక్క కేసు మాత్రమే ఉన్నవి 3,110

అర్బన్‌ ప్రాంతాల్లోనూ అదుపులోకి వచ్చిన కరోనా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా కిందకు దిగివస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలుండగా.. అందులో 5,515 సచివాలయాల పరిధిలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేదు. అలాగే ఒక్క కేసు మాత్రమే ఉన్న సచివాలయాలు 3,110 ఉన్నాయి. 50 కేసులు అంతకంటే ఎక్కువగా కేవలం ఒకే ఒక్క గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నాయి. అలాగే పట్టణాల్లో(అర్బన్‌) కూడా కరోనా కేసులు తగ్గుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్‌లు కలిపి 111 ఉన్నాయి. వీటిలో 50 కంటే తక్కువ కేసులున్న పట్టణాలు 76 ఉండగా.. 50 నుంచి 100 కేసులు నమోదై ఉన్నవి 20 మాత్రమే ఉన్నాయి. విశాఖ అర్బన్‌ ప్రాంతంలో మాత్రమే 906 కేసులున్నాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో 500 కంటే తక్కువ పాజిటివ్‌లే ఉన్నాయి. ఇక మండలాల వారీగా తీసుకుంటే.. 4 కంటే తక్కువ కరోనా కేసులు 35 మండలాల్లో ఉన్నాయి. పది లోపు పాజిటివ్‌లు 70 మండలాల్లో.. 100 అంతకంటే ఎక్కువ కేసులు కేవలం 66 మండలాల్లో ఉన్నాయి. ఒకదశలో 84.32కు పడిపోయిన రికవరీ రేటు.. తాజా గణాంకాల ప్రకారం 96.95కు చేరింది. అలాగే గతంలో 2 లక్షలకు పైగా ఉన్న యాక్టివ్‌ కేసులు.. ఇప్పుడు 42,252కు తగ్గాయి.  

>
మరిన్ని వార్తలు