ఆగస్టుతో పోలిస్తే కరోనా తగ్గుముఖం

22 Sep, 2020 03:55 IST|Sakshi

ఆగస్టులో 100 టెస్టులకు 16.97 శాతం పాజిటివ్‌

సెప్టెంబర్‌ నాటికి 11.47 శాతానికి తగ్గుదల

వచ్చేనెలకు మరింత తగ్గుతుందంటున్న నిపుణులు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఓ మోస్తరుగా నమోదైన కేసులు ఆగస్టులో భారీగా పెరిగాయి. రోజూ పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే సెప్టెంబర్‌ ఆరంభం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. టెస్టులు మాత్రం రోజుకు సగటున 70 వేలకు పైగా చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ప్రతి 100 టెస్టులకు 16.97 శాతం పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అది 11.47 శాతానికి తగ్గింది. మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండటం, మరణాల సంఖ్య తగ్గడంతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జూలై నెలలతో పోలిస్తే కరోనా మరణాలు గణనీయంగా తగ్గడంతో వైరస్‌ వ్యాప్తే కాకుండా దాని ప్రభావం కూడా  తగ్గినట్లు కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అక్టోబర్‌ నాటికి కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు బాగా తగ్గాయి.

క్రమంగా తగ్గుతోంది
ఆగస్టులో పీక్‌ స్టేజికి వెళ్లిన కరోనా ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. పట్టణాల్లో ఇప్పటికే బాగా తగ్గింది. ప్రస్తుతం పల్లెల్లో కేసులు ఉన్నాయి. వచ్చే నెలలో పల్లెల్లో కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తాజాగా నమోదవుతున్న కేసుల్లోనూ తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. లక్షణాలున్న వారు సీటీస్కాన్‌ చేయించుకుని డబ్బులు పోగొట్టుకోవద్దు. గ్రామాల్లో యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు.     
– డా.కె.ప్రభాకర్‌రెడ్డి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి 

మరిన్ని వార్తలు