ఆ ఊరంటే 'కరోనాకు' హడల్‌

6 May, 2021 05:27 IST|Sakshi
గంగిరెడ్డిపల్లి గ్రామం

అనంతపురం జిల్లా దిగువ చెర్లోపల్లిలో వైరస్‌ జీరో

ఊరి నుంచి అడుగు బయటపెట్టని ప్రజలు

ఏ అవసరమొచ్చినా సచివాలయాన్నే ఆశ్రయిస్తారు

పుట్టపర్తి అర్బన్‌: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్‌ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా ఉన్నాయి. మహమ్మారి విజృంభిస్తున్న వేళ అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లి గ్రామస్తులు ఊరి నుంచి కాలు బయట పెట్టకుండా నిశ్చింతగా జీవిస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలో సాతార్లపల్లి, గంగిరెడ్డిపల్లి, దిగువ చెర్లోపల్లి గ్రామాలుండగా.. కరోనా మొదటి, రెండో దశలోనూ ఒక్క కేసూ నమోదు కాకుండా ఇక్కడి ప్రజలు జాగ్రత్త పడ్డారు.

ఊరు దాటి వెళ్లకుండా..
గ్రామ పంచాయతీ జనాభా సుమారు 2 వేలు కాగా.. విద్యార్థులంతా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా సచివాలయంలోనే పరిష్కరించుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామానికి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పట్టణాలకు వెళ్లడం లేదు. అందువల్లే వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు.

సేంద్రియ సేద్యం.. పౌష్టికాహారం
దిగువ చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని వారంతా వేరుశనగ, కంది, వరి, మొక్కజొన్న, బంతి పూలు, తీగ జాతి కూరగాయ పంటల్ని అధికంగా సాగుచేస్తారు. అక్కడి రైతులకు దేశవాళీ ఆవులు, గేదెలు, ఎద్దులున్నాయి. వాటి నుంచి వచ్చే పేడ, అక్కడ దొరికే ఆకులతో తయారైన ఎరువులనే పంటలకు  వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం బాగా తక్కువ. వీరంతా తాము పండించిన పంటలనే తినేందుకు వినియోగిస్తున్నారు. చికెన్‌ తినాలన్నా.. తాము సొంతంగా పెంచుకున్న నాటు కోళ్లనే వినియోగిస్తున్నారు. 

వైరస్‌ వ్యాప్తి లేదు
అదృష్టవశాత్తు మాకెవరకి కరోనా వైరస్‌ సోకలేదు. మా గ్రామాల్లో ఇతర రోగాల బారిన పడిన వారు కూడా చాలా తక్కువ. మేమంతా స్థానికంగా దొరికే వాటితోనే భోజనం సిద్ధం చేసుకుంటాం. అందువల్లే వైరస్‌ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటున్నాం. 
– లక్ష్మీనరసమ్మ, గంగిరెడ్డిపల్లి, అనంతపురం జిల్లా

పట్టణాలకు వెళ్లకపోవడం వల్లే.. 
అటవీ గ్రామాల వారు దాదాపుగా బయటి ప్రదేశాలకు వెళ్లరు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినా స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోనే చూపించుకుంటారు. అందువల్లే వైరస్‌ సోకకుండా హాయిగా జీవనం గడుపుతున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది.  
– అజయ్‌కుమార్‌రెడ్డి, వైద్యాధికారి, వెంగళమ్మచెరువు 

మరిన్ని వార్తలు