అలుపెరగని సేవకి... డాక్టర్‌ పద్మావతి!

7 May, 2021 18:51 IST|Sakshi
వ్యాక్సినేషన్‌ విధుల్లో ఉన్న డాక్టర్‌ పద్మావతి

 కరోనా టెస్టులు మొదలు వ్యాక్సినేషన్‌ వరకు నిర్విరామ సేవలు

గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పీహెచ్‌సీలో పనిచేస్తోన్న డాక్టర్‌ జి.పద్మావతి కోవిడ్‌ వారియర్‌గా కరోనా రోగులకు నిర్విరామ సేవలు అందిస్తున్నారు. పీహెచ్‌సీలో పద్మావతితో పాటు మరో డాక్టర్‌ ఉన్నారు. ఆ డాక్టర్‌ సెలవులో ఉండటంతో పద్మావతి ఒక్కరే సేవలు అందిస్తున్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించడం నుంచి వ్యాక్సినేషన్‌ వరకు అన్నీ డాక్టర్‌ పద్మావతి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం పీహెచ్‌సీ పరిధిలో పదుల సంఖ్యలో కరోనా టెస్టులు, వందల సంఖ్యలో కోవిడ్‌ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మాడుగుల పీహెచ్‌సీ పరిధిలో 95 మందికి పైగా కరోనా రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి సలహాలిచ్చి త్వరగా కొలుకునే విధంగా పద్మావతి చర్యలు తీసుకుంటున్నారు. 

వరండాలోనే నిద్ర... 
డాక్టర్‌ పద్మావతికి పదేళ్లు, ఏడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ వైద్యశాలలో కోవిడ్‌ అనుమానితులకు పరీక్షలు చేయించిన తరువాత ఇంటికి వెళ్తే పిల్లలకు ఇబ్బందులు వస్తాయనే భావనతో వారిని తన పుట్టింటికి పంపించారు. విధుల అనంతరం ఇంటికి వెళ్లినా బయట నుంచే తన భర్త శ్రీహర్ష, అత్త బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇంటి వరండాలో ఉన్న గదిలోనే నిద్రిస్తున్నారు. భర్త కూడా వైద్యుడు కావడంతో ఆమెను ప్రోత్సహిస్తున్నారు. 

సేవలోనే సంతృప్తి.. 
కోవిడ్‌ రోగులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తోంది. రామాపురానికి చెందిన ఒక వృద్ధుడు కోవిడ్‌ బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే, అతని కుమారుడు ఆస్పత్రికి తీసుకురావడం కుదరదని చెప్పాడు. వెంటనే అతని ఇంటికి ప్రైవేట్‌ అంబులెన్సును పంపి, అతనికి ఆక్సిజన్‌ అందించి గుంటూరుకు రిఫర్‌ చేయడంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ప్రాణాలను కాపాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. 
– జి పద్మావతి, మాడుగుల పీహెచ్‌సీ వైద్యురాలు 

మరిన్ని వార్తలు