Covid-19: కరోనా మిగిల్చిన కన్నీటి కథలు

6 Jun, 2021 13:07 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పది రోజుల కిందట ఆస్పత్రికి వెళ్లిన నాన్న ఇంటికి వస్తాడేమోనని గడప మీదే ఎదురుచూస్తోంది ఓ పాప. అంబులెన్స్‌ ఎక్కిన అమ్మ మళ్లీ ఎప్పుడు వస్తుందని అన్నం ముద్ద తిన్న ప్రతిసారీ అడుగుతున్నాడో పసివాడు. నాన్నమ్మ పక్కన పడుకుంటూ అమ్మానాన్న రేపు వచ్చేస్తారు కదా.. అని అమాయకంగా అడుగుతున్నారు చిన్నారులు. పాపం వీరికి తెలీదు అమ్మానాన్నలు లేరని.. ఇక రారని.

పసిపిల్లల కన్నీటితో కోవిడ్‌ రాస్తున్న మరణ శాసనాలు ఆగడం లేదు. ఘడియ సేపు అమ్మ కనబడకపోతే ఉగ్గబట్టి ఏడ్చే పిల్లలకు తల్లులు శాశ్వతంగా దూరమైపోతున్నారు. సాయంత్రం నాన్న రాకపోతే అలిగి మాట్లాడడం మానేసే బుజ్జాయిలకు నాన్నా అని పిలిచే భాగ్యం దూరమైపోయింది. జిల్లాలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన చిన్నారులు 11 మంది ఉండగా, తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్న వారు 305 మంది ఉన్నారు. అందులో కొందరి కన్నీటి కథలివి. 

నాన్న కోసం ఎదురు చూపులు..
నాన్న ఉన్నారో, చనిపోయారో తె లియని పసితనం వారిది. ఆస్పత్రికి వెళ్లిన నాన్న తిరిగి వస్తారని ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. తండ్రిని తలచుకుంటూ ఆ చిన్నారులిద్దరూ కుమిలిపోతున్నారు. సోంపేట మేజర్‌ పంచాయతీకి చెందిన శివనాయకో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవారు. గ్రామంలో కరోనా ప్రబలకుండా నిరంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహించే శివనాయకోకు కరోనా సోకింది.

దీంతో సోంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వై ద్యం కోసం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించినా ప్రా ణాలు దక్కలేదు. మే 12న శ్రీకాకుళంలో మృతి చెందాడు. భార్య జమునా నాయకో, ఇద్దరు కుమార్తెలు ధనలక్ష్మీ నాయకో, శివాని నాయకోలు ఉన్నారు. చిన్న కుమార్తె శివాని నాయకోకు కొద్దిగా అనారోగ్య స మస్యలు ఉన్నాయి. ఇంటి పెద్ద దూరం కావడంతో ఇద్దరు పసివాళ్లు తండ్రిలేని వారయ్యారు. 

ఎంత కష్టం..? 
పొందూరు మండలంలోని నందివాడ గ్రామంలో కెల్ల అ నూరాధ ఇద్దరు కు మారులతో జీవిస్తున్నారు. భర్త కెల్ల గొల్లబాబు కరోనా సోకడంతో గతేడాది ఆగస్టు 27న శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గొల్లబాబు బిల్డింగ్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయన మృతి చెందడంతో పిల్లలను పో షించుకోలేక అనూరాధ తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. పెద్ద కుమారుడు చక్రధర్‌కు 19 ఏళ్లు. పూర్తిగా అంగవైకల్యం ఉంది. చిన్న కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి దయనీయంగా మారింది. 

ఆ మాటలు వింటే.. 
పాప వయసు ఎ నిమిది నెలలు. మ రో పాప వయసు మూడేళ్లు. ఇద్దరూ తల్లిచాటు బిడ్డలే. కానీ ఇప్పుడా తల్లి లేదు. అమ్మ కో సం వారు మా ట్లాడుతుంటే కుటుంబ సభ్యుల గుండెలవిసిపోతున్నాయి. ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్న మట్టా సత్యవతి(36) గత నెల 12న శ్రీకాకుళం రిమ్స్‌లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమెకు జ్యోత్స్న (8నెలలు) , మహిత(3)లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలు తల్లి లేనివారయ్యారు. భర్త మట్టా భూషణ్‌ ప్రస్తుతం వీరిద్దరినీ చూసుకుంటున్నారు.  

 నాన్న ఎప్పుడు వస్తారంటూ.. 
ఇచ్ఛాపురం పట్టణంలోని షరాబువీధికి చెందిన సంశెట్టి బాలకష్ణ (44) మే 27న కరోనాతో మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శ్రీదేవి గృహిణి. ఇంటి వద్దనే ఉంటూ వారి ఇద్దరు పిల్లలు దిలీప్‌(10), ప్రసన్న(6) చూసుకునేవారు. తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లడం పిల్లలిద్దరూ చూశారు. తర్వాత రోజు నుంచి నాన్న ఎప్పుడు వస్తారంటూ అడుగుతూనే ఉన్నారు.

పసిపిల్లల వేదన చూసి తట్టుకోలేని తల్లి, కుటుంబ సభ్యులంతా ఓదారు స్తున్నా నిజం వివరించడం ఎవరి తరం కావడం లేదు. ప్రతి రోజు నాన్న తమతో సరదాగా ఉండేవారని, కావాల్సినవి కొనిచ్చేవారని గుర్తు చేసుకుంటున్నారు. నాన్న గురించి ఆ ఇద్దరు పిల్లలు చెబుతుంటే కన్నీళ్లు ఆగని పరిస్థితి. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పిల్లల బంగారు భవిత అగమ్య గోచరంగా మారింది.  

దీన పరిస్థితి.. 
చిత్రంలో ఇద్దరు ముక్కుపచ్చలారని ఆడపిల్లలతో దీనంగా కనిపిస్తున్న ఈమె పేరు బమ్మిడి రాజేశ్వరి. వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు గ్రామం. రాజేశ్వరి భర్త బమ్మిడి రమేష్‌ బైక్‌ మెకానిక్‌. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఏడేళ్లు వయస్సు ఉన్న రేవతి(7), జ్యోతి(5) పూండిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవల కరోనా మహమ్మారి రమేష్‌ను కబళించింది. ఇంటి పెద్దను కరోనా తీసుకెళ్లిపోవడంతో వీరి జీవితాలు అంధకారంగా మారాయి.  

పెద్ద దిక్కు ఎవరు..? 
వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామానికి చెందిన పేలూరు రాము ఏప్రిల్‌ 18న కరోనా లక్షణాలతో చనిపోయారు. బార్బ ర్‌ వృత్తి చేస్తూ వచ్చే అరకొర డబ్బులతో భార్య ప్రమీల, ఇద్దరు ఆడపిల్లలు తేజస్విని,రేష్మలను పోషించేవారు. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైంది. సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. 

ఎలా బతకాలో.. 
వంగర మండలం కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన సాలాపు రమేష్‌(45) ఇటీవల కరోనాతో విశాఖపట్నంలో మృతి చెందారు. పొట్టపోషణ కోసం ఆ కుటుంబం పదేళ్ల కిందట విశాఖపట్నంలోని ఆరిలోవకు వలస వెళ్లింది. మే 5న కరోనా పాజిటివ్‌ వచ్చి ఇంటి పెద్ద రమేష్‌ మృతి చెందారు. వారికి ఎలాంటి ఆస్తులు లేవు. ఇంటికి పెద్ద దిక్కు అయిన ఆయన తెచ్చిన కూలితోనే జీవనం సాగేది. రమేష్‌ భార్య జయ ఆరోగ్యం సరిగా లేదు. వారికి జ్యోతిర్మయి(14), పల్లవి(10) ఇద్దరు కుమార్తెలున్నారు. వారిని ఆరిలోవలోనే చదివిస్తున్నారు. రమేష్‌ మరణాంతరం కొండచాకరాపల్లి వచ్చేశారు. ఇప్పుడు ఎలా బతకాలో అర్థం కాని దుస్థితి వీరిది. 

సాటివారికి సాయపడదాం.. 
తండ్రిని కోల్పోయి కొందరు.. తల్లిని కోల్పోయి మరికొందరు చిన్నారులు రేపటిపై బెంగ పెట్టుకున్నారు. భవిష్యత్‌పై వారు కన్న కలలన్నీ కన్నీటిలో కరిగిపోయాయి. ఇలాంటి విషమ పరిస్థితిలో వారికో ఆసరా కావాలి. ఇక్కడితో బతుకు అయిపోలేదనే నిజం చెప్పాలి. రేపటి రోజు బాగుంటుందని ధైర్యమివ్వాలి. అందుకు అందరూ చేతులు కలపాలి. ఆర్థికంగా చేసే సాయమే ఇప్పుడు వారికి ఆత్మ బలాన్నిస్తుంది.

మీరూ ఆ చిన్నారులను ఆదుకోవాలనుకుంటే ఈ కింది నంబర్లను సంప్రదించండి. వారి బతుకు నావ సాగడానికి చిరుసాయం చేయండి. సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి అండగా నిలవండి. ఈ నంబర్లకు కాల్‌ చేసి బాధితుల వివరాలు తెలుసుకుని మీరే నేరుగా సాయం అందించవచ్చు.
-బాధితుల వివరాలు తెలుసుకోవడానికి కాల్‌ చేయాల్సిన నంబర్లు
99121 99696, 85550 56665, 90105 40099 
చదవండి: కులాంతర వివాహం చేసుకున్నాడని.. 

>
మరిన్ని వార్తలు