తెలంగాణ నుంచి గుంటూరు వచ్చి పునర్జన్మ 

29 Apr, 2021 15:30 IST|Sakshi

జీజీహెచ్‌లో కరోనా చికిత్స పొందుతున్న వృద్ధుడి ఆనందం

సాక్షి, అమరావతి: ‘ప్రాణాలపై ఆశలు వదులుకున్న నాకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే ఊపిరి పోసింది. ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటా’.. ఇవీ కరోనా బారినపడి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల నారబోయిన పెద సత్యం కృతజ్ఞతతో చెప్పిన మాటలు. నారబోయిన పెద సత్యం తెలంగాణలోని మిరియాలగూడ మండలం తడికళ్ల గ్రామానికి చెందిన ఓ కూలీ. వారం కిందట జ్వరమెస్తే ప్రైవేటు ఆస్పత్రిలో రూ.10 వేలు ఖర్చచేసినా తగ్గలేదు. పరీక్షల్లో కరోనా సోకిందని తేలింది. దగ్గు, ఆయాసం ఎక్కువై పరిస్థితి విషమించింది.

కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని, రూ.4 లక్షలు ఖర్చవుతుందని స్థానిక వైద్యులు చెప్పారు. అంత భరించలేని పరిస్థితుల్లో మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా చేర్చుకోలేదు. చేసేదేమీలేక ఇంటికి చేరి, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉంటున్న తన కుమార్తెకు ఫోన్‌ చేసి కన్నీటిపర్యంతమయ్యాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనాకు ఉచిత వైద్యం అందుతోందని, ఇక్కడ చేరాలని సత్యానికి అతని అల్లుడు బొల్లేపల్లి వీరయ్య ధైర్యం చెప్పాడు.

కుమ్మర శాలి వాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.పురోషోత్తం తన సొంత ఖర్చులతో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి సోమవారం సాయంత్రం పెదసత్యాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. కొన్ని గంటల్లోనే అతడికి ఆక్సిజన్‌ పెట్టారు. వేగంగా కోలుకుంటున్న పెద సత్యం బుధవారం తన కుమార్తెకు ఫోన్‌ చేసి ‘ఇప్పుడు బతుకుతాననే నమ్మకం వచ్చిందమ్మా. జగన్‌ సార్‌ బతికిస్తున్నాడమ్మా’ అని ఆనందంతో చెప్పాడు. డాక్టర్లు, నర్సులు తన కోసం ఎంతో కష్టపడుతున్నారని, ప్రేమగా పలకరిస్తున్నారని పేర్కొన్నాడు.
చదవండి: చెరకు రైతులకు ‘ఏటీఎం’లా!

మరిన్ని వార్తలు