అవును.. టీకా రక్షణ కవచమే! 

4 May, 2021 04:26 IST|Sakshi

రెండు డోసులు వేయించుకున్న వారిలో పాజిటివ్‌లు అరుదు

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ టీకా భరోసా ఇస్తోంది. టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ అపోహలని తేలిపోయాయి. రాష్ట్రంలో కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్న వారిలో పాజిటివ్‌ కేసులు బాగా తగ్గిపోయినట్టు వైద్యుల పరిశీలనలో తేలింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లు, 45 ఏళ్లు దాటిన వారికి ఇప్పటివరకూ టీకా వేశారు. వీరిలో రెండు డోసులు వేయించుకున్న అనంతరం 2 వారాల గడువు తర్వాత పాజిటివ్‌ కేసులు అత్యంత స్వల్పంగా 6% మాత్రమే నమోదైనట్టు తేలింది. వారు కూడా వెంటనే కోలుకున్నారు.

అలాగే ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ జరిగిన మరణాలను చూస్తే రెండు డోసులు వేయించుకున్న వారిలో ఒక్కరు కూడా మృతి చెందలేదు. దీన్నిబట్టి కరోనా నియంత్రణ టీకా సత్ఫలితాలను ఇస్తున్నట్టు వెల్లడైంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా కైకలూరులో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉన్న 200 మంది పోలీసులకు రెండు డోసులు టీకా పూర్తయింది. కానీ కరోనా ఇంత ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలోనూ ఒక్క పోలీసుకు కూడా పాజిటివ్‌ రాలేదని ధ్రువీకరించారు. అలాగే నిత్యం ఆస్పత్రుల్లో ఉండే హెల్త్‌కేర్‌ వర్కర్లలోనూ పాజిటివ్‌ కేసులు వెయ్యికి ఒకటి కూడా నమోదు కాలేదని వైద్యులు తెలిపారు.

భౌతిక దూరం పాటించాల్సిందే 
రెండు డోసులు వేసుకున్న వారిలో పాజిటివ్‌ కేసులు అరుదుగా వస్తున్నాయి. టీకా ఫలితాలు చాలా బావున్నాయి. రెండు డోసులు వేసుకున్నాం కదా అని విచ్చలవిడిగా తిరగకూడదు. మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందే.  
– డా.రాంబాబు, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్, ఆంధ్రామెడికల్‌ కాలేజీ 

వచ్చినా తీవ్రత చాలా స్వల్పం 
తాజా గణాంకాలను పరిశీలించాం. రెండు డోసులు వేసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చిన వారిని చూశాం. వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మృతి చెందే ప్రమాదం లేదు. వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా తీవ్రత తగ్గుతుందని గుర్తించాలి. జాగ్రత్తగా ఉండాలి. 
– డా.బి.చైతన్య,హృద్రోగ నిపుణులు, విజయవాడ   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు