మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం

5 Oct, 2021 09:11 IST|Sakshi
కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం, ఇన్‌సెట్‌లో మేయర్‌ పావని 

ప్రిసైడింగ్‌ అధికారిగా జేసీ లక్ష్మీశ

చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌

క్యాంప్‌ నుంచి వచ్చిన కార్పొరేటర్లు

సాక్షి, కాకినాడ: నగర మేయర్‌ సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆధ్వర్యాన నగరపాలక పాలక సంస్థ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్‌ హాలులో ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు డిప్యూటీ మేయర్‌ సత్తిబాబులపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుంది. జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

ఓటింగ్‌ ప్రక్రియ జరిగేది ఇలా..
44 మంది కార్పొరేటర్లతో పాటు మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి 47 మందికి ఓటు హక్కు ఉంది. మూడింట రెండు వంతుల మంది అంటే 31 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. చేతులెత్తే పద్ధతిపై ఓటింగ్‌ జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 31 మంది అనుకూలంగా ఓటు వేయాలి. కార్పొరేటర్లు చేతులెత్తి అభీష్టం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించాక మేయర్‌ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్‌ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాన్ని 22వ తేదీ వరకూ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 33 మంది సంతకాలు చేసి, ఐక్యతతో ఉన్నందున పావని పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

టీడీపీ విప్‌పై గందరగోళం
టీడీపీ విప్‌పై గందరగోళం నెలకొంది. వాస్తవానికి మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా కేవలం మేయర్‌ విషయంలోనే విప్‌ జారీ చేస్తూ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో అసహనం రేకెత్తించింది. మేయర్‌ విషయంలో విప్‌ జారీ చేసి, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌పై నిర్లక్ష్యం చేయడాన్ని ఆ పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు పావనిపై అసమ్మతి కార్పొరేటర్లతో పాటు స్వపక్షంలోని 9 మంది అసమ్మతితో రగిలిపోతున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్‌ వ్యతిరేక శిబిరంలో పార్టీలకు అతీతంగా 33 మంది ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, బీజేపీల్లోని అసమ్మతి కార్పొరేటర్లున్నారు. మేయర్‌తో కలిపి టీడీపీకి అనుకూలంగా పది మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్‌ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆ పార్టీ ఆదేశాల మేరకు తటస్థంగా వ్యవహరించనున్నారు.

కార్పొరేటర్లపై అధిష్టానానికి ఫిర్యాదు : మేయర్‌ పావని
కాకినాడ సిటీ: టీడీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మేయర్‌ సుంకర పావని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను కలెక్టర్‌కు వివరించేందుకు ఆమె సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 22 వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టు తెలిపిందని మేయర్‌ వివరించారు. ఇప్పటికే కార్పొరేటర్లకు టీడీపీ విప్‌ జారీ చేసిందన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తన వెంట 10 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు.

మరిన్ని వార్తలు