కాంట్రాక్టర్‌ చీరవాటం.. ఇంద్రకీలాద్రిపై మరో అవినీతి బాగోతం వెలుగులోకి..

9 Apr, 2022 10:21 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అవకతవకలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తున్నా.. దేవస్థానం యంత్రాంగంలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి వివిధ సరుకుల సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు బహిర్గతమయ్యాయి. టెండరు షెడ్యూలులో పేర్కొన్న విధంగా నాణ్యమైన సరుకులకు బదులు నాసిరకం పంపిణీ చేస్తుండడం తెలిసిందే. అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద కాయలు కొట్టినందుకు కొంతమంది కాంట్రాక్టరుకు చెందిన సిబ్బంది భక్తుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం కూడా విదితమే. తాజాగా అమ్మ వారికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన చీరల విక్రయంలోనూ బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు.  

ఇదీ సంగతి.. 
అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను విక్రయించే కాంట్రాక్టును ఓ కాంట్రాక్టర్‌ దక్కించుకున్నాడు. దేవస్థాన ప్రాంగణంలోనూ, ఘాట్‌ రోడ్డులో ప్రసాదాలు విక్రయించే కేంద్రాల వద్ద చీరల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ‘శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల వస్త్ర ప్రసాద విక్రయ కేంద్రం’ పేరిట ఉన్న ఈ కౌంటర్లలో చీరలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కౌంటర్లలో కొన్ని చీరలకు మాత్రమే ధరను తెలిపే స్టిక్కర్లను అంటిస్తున్నారు. మిగతా చాలా చీరలను ఆ కౌంటర్లో ఉన్న సిబ్బందే ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. చీరల కొనుగోలుకు వచ్చిన భక్తులను ఎంత ఖరీదువి కావాలని వీరు అడుగుతున్నారు. దాన్ని బట్టి కొన్నింటిని చూపిస్తున్నారు. వాటిపై ఎలాంటి ధర లేకుండానే విక్రయిస్తున్నారు. ఇలా పలు చీరలకు వస్త్ర దుకాణాల్లో ధరల కంటే ఎక్కువ ధర చెప్పి.. కాస్త తగ్గించి ఇస్తున్నారు. ఉదాహరణకు షాపులో రూ.600–700కు మించని (ధర స్టిక్కరు లేని) చీర రూ.వెయ్యి చెప్పి వందో, యాభయ్యో తగ్గిస్తున్నారు. 

రశీదు కూడా లేకుండా.. 
వాస్తవానికి భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించేటప్పుడు దాని ఖరీదు ఎంతో అడిగి తెలుసుకుని రశీదు ఇస్తారు. వీటిని ఆ ధరపై 20–25 శాతం తక్కువ ధర నిర్ణయించి అమ్మకానికి పెడతారు. ఇలా విక్రయించే చీరలకు విధిగా బిల్లు ఇవ్వాలి. ఇందుకోసం ఈ కౌంటర్లలో ఒక బిల్లింగ్‌ మిషన్‌ను కూడా అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ విక్రయించే చీరలకు బిల్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చీరల విక్రయ కౌంటర్‌

భక్తుల సెంటిమెంటే ఆయుధం
భక్తులు అమ్మ వారి చీర కొనుక్కోవడం అంటే ఎంతో సెంటిమెంటుగా భావిస్తారు. దీంతో చాలామంది చీరలపై ధర లేకపోయినా, బిల్లు ఇవ్వకపోయినా అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖరీదు చేసే చీరలను ఎక్కువ ధరకు అమ్మడం, వాటికి బిల్లు ఇవ్వకపోవడం ద్వారా సదరు కాంట్రాక్టరు భక్తుల నుంచి భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు. కళ్లెదుటే ఇంతటి మోసం జరుగుతున్నా దేవస్థానం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంట్రాక్టరు దోపిడీకి అడ్డుకట్ట వేయడం లేదు.  

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.. 
నిబంధనల ప్రకారం అమ్మవారి వస్త్ర ప్రసాదం చీరలపై విధిగా ధర ఉండాలి. విక్రయించిన చీరలకు కచ్చితంగా బిల్లు ఇవ్వాలి. అలా విక్రయించడం తప్పు. వస్త్ర ప్రసాద విక్రయ కౌంటర్లలో అక్రమాలకు తావు లేకుండా చూస్తాం. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.  
– భ్రమరాంబ, ఈవో, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం  

మరిన్ని వార్తలు