AP: ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో సాగు.. వెలుగులీనుతోన్న తెల్లబంగారం

1 Oct, 2022 10:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: పత్తి రైతు పంట పండింది. తెల్లబంగారం వెలుగులీనుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రికార్డుస్థాయిలో సాగవడమే కాదు.. దిగుబడులు కూడా భారీగా వచ్చేలా కనిపిస్తోంది. చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో గతేడాది క్వింటాల్‌ రూ.13 వేలకుపైగా పలకడంతో ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో రైతులు పత్తిసాగువైపు మళ్లారు. వేరుశనగ సాగుచేసే రైతులు సైతం ఈ ఏడాది పత్తి సాగుచేశారు. ఫలితంగా సాగువిస్తీర్ణం బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే రూ.3 వేలకుపైగా ఎక్కువగా పలుకుతున్న ధర నిలకడగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. 

రాష్ట్రంలో పత్తి సాధారణ సాగువిస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. 2019–20లో 16 లక్షల ఎకరాల్లో సాగవగా, 2020–21లో 14.50 లక్షల ఎకరాల్లో, 2021–22లో  13.32 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది అకాల వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో 12.29 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి.  2022–23 ఖరీఫ్‌ సీజన్‌లో రికార్డు స్థాయిలో 16.50 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి చరిత్రలో 2014–15లో 16.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు అదే రికార్డు. ఈ రికార్డును అధిగమించే స్థాయిలో ఈ ఏడాది 16.50 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. 2014–15లో 15.50 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 17.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మొదటి ముందస్తు అంచనాగా లెక్కించారు.

సీజన్‌ పూర్తయ్యేనాటికి దిగుబడి 20 లక్షల టన్నులకుపైగానే రావచ్చని భావిస్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో వస్తే దిగుబడుల్లో కూడా కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సమయానుకూలంగా కురుస్తున్న వర్షాలు పత్తికి మేలు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెగుళ్లు ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. ఏటా కలవరపెట్టే గులాబీ తెగులు కూడా ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం రైతులకు కలిసొచి్చంది. పత్తి ఎక్కువగా సాగయ్యే కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో బోర్లకింద ఈసారి ఎకరాకు 15–20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌ కనీస మద్దతు ధర.. పొడుగుపింజ పత్తికి రూ.6,380, మధ్యస్థ పత్తికి రూ.6,080గా ప్రకటించింది.

గతేడాది క్వింటాల్‌ రూ.13 వేలవరకు పలికిన ధర ప్రస్తుతం రూ.9,501 ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో నిలకడగా ఉన్న ధర సీజన్‌ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండేళ్ల పాటు పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21లో 18 లక్షల క్వింటాళ్ల చొప్పున రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలుచేసింది. గతేడాది కూడా 50 మార్కెట్‌ యార్డులతోపాటు 73 జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాగువిస్తీర్ణం తగ్గడం, అంతర్జాతీయంగా కాటన్‌ యార్న్‌ ధరలు పెరగడంతో పత్తికి రికార్డుస్థాయి ధర పలికింది.

ఫలితంగా రైతులు ఈ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కట్టారు. గతేడాది 6.13 లక్షల క్వింటాళ్ల పత్తి యార్డుకు రాగా ఈ ఏడాది ఇప్పటికే 1.80 లక్షల క్వింటాళ్ల పత్తి వచి్చంది. ప్రస్తుతం సగటున రోజుకు ఆరువేల క్వింటాళ్ల చొప్పున ఈ యార్డుకు వస్తోంది. సీజన్‌ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే రోజుకు 15 వేల నుంచి 20 వేల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం ఈసారి 7–10 లక్షల క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. 

ధర నిలకడగా ఉంది  
గత సీజన్‌లో రికార్డుస్థాయిలో ధర పలికింది. గరిష్టంగా క్వింటాల్‌ రూ.13 వేలకుపైగా పలికింది. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం ధర రూ.9,501 వద్ద ఉంది. యార్డుకు రోజుకు సగటున ఆరువేల క్వింటాళ్ల చొప్పున పత్తి వస్తోంది. ఈరోజు 1,044 లాట్స్‌ (4,957 క్వింటాళ్లు) పత్తి వచి్చంది. 
– బి.శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా 

అవసరం ఉండదనుకుంటున్నాం
ప్రభుత్వాదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మార్కెట్‌లో రికార్డుస్థాయిలో ధర పలకడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. రైతులెవరు మా కేంద్రాలను ఆశ్రయించలేదు. ఫలితంగా క్వింటా పత్తి కూడా కొనుగోలు చేయలేదు. గతేడాది రికార్డుస్థాయిలో రూ.13 వేలకుపైగా పలికింది. ప్రస్తుతం 9,500 వరకు పలుకుతోంది. గత సీజన్‌ మాదిరిగానే ధర పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదనే భావిస్తున్నాం.     
– జి.సాయిఆదిత్య, ఏజీఎం, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 

మరిన్ని వార్తలు