‘పంటల బీమా’లోనూ విషపు నాట్లు

21 Jun, 2022 08:23 IST|Sakshi

టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి కేవలం రూ.3,411 కోట్లే బీమా పరిహారం

అదే వైఎస్సార్‌సీపీ మూడేళ్లలో 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్లు చెల్లింపు

చంద్రబాబు ఎగ్గొట్టిన 6.19 లక్షల మందికీ రూ.715.84 కోట్లు అందజేత

టీడీపీ హయాంలో ఏటా సగటున 23.57 లక్షల హెక్టార్ల పరిధిలోని పంటలకే బీమా

బీమా చేయించుకునే రైతులు కూడా 20 లక్షల్లోపే.. 

అదే వైఎస్సార్‌సీపీ మూడేళ్ల పాలనలో సగటున 53.86 లక్షల హెక్టార్లకు బీమా

బీమా పరిధిలోకి వచ్చే రైతులూ ఏటా సగటున 60.35 లక్షల మందికి పైమాటే

ఇక ఖరీఫ్‌–21లో రికార్డు స్థాయిలో 15.61 లక్షల మందికి   రూ.2,977.82 కోట్ల పరిహారం చెల్లింపు

 గతంలో ఇంత పెద్దమొత్తంలో ఇన్ని లక్షల మందికి చెల్లించిన దాఖలాలున్నాయా రామోజీ?

పంటల నమోదే ప్రామాణికంగా పంటల బీమా అమలు

పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింపు

కానీ, వీటన్నింటినీ వక్రీకరిస్తూ ‘ఈనాడు’లో రోత రాతలు.. 

రామోజీకి కనిపించని వాస్తవాలు

చంద్రబాబు కాకుండా సీఎం కుర్చీలో ఇంకొకరు ఉంటే తన ప్రాణం ఎంతలా కొట్టుకుంటుందో ఈనాడు రామోజీరావు మళ్లీ నిరూపించుకున్నారు. చంద్రబాబు తన పాలనలో కనీసం ఊహకు కూడా తట్టని రీతిలో వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్న ఈనాడు.. నిత్యం అక్షరం అక్షరంలో అసత్యాలు, అభూత కల్పనలు నింపి పాఠకుల మీదకు వదులుతోంది. రైతుల పంటల బీమాకు సంబంధించి టీడీపీ హయాంలో కంటే మిన్నగా అన్నదాతలకు ప్రస్తుత ప్రభుత్వం మేలు చేస్తున్నా రామోజీ పెడబొబ్బలకు అంతులేకుండాపోతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి మించింది లేదని బీమా రంగ నిపుణులు కితాబిస్తుంటే.. ఈనాడు మాత్రం జనాల మెదళ్లలో విషపు నాట్లు వేస్తోంది. 

ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలదించుకునేలా ఉన్న రామోజీ తాజా వంటకం ‘పంటల బీమా అగమ్యగోచరం’పై నిజానిజాలు ఇవిగో..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు   ఆధారంగా తెచ్చిన మోడల్‌ ఇన్సూరెన్స్‌ పథకం ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకుని ప్రస్తుతం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకంగా అమలవుతోంది. అధిక ప్రీమియంతో ఇందులో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారుకాదు. ఆర్థిక స్థోమత, అవగాహనలేక లక్షలాది మంది రైతులు తమ పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. అలాగే, బీమా చేయించుకున్న వారు సైతం ఆ సొమ్ములు ఎంతొస్తాయో.. ఎప్పుడొస్తాయో? తెలీక ఏళ్ల తరబడి నిరీక్షించేవారు.

టీడీపీ హయాంలో కూడా కేంద్ర పథకాలపై ఆధారపడి పంటల బీమా వర్తింపజేశారే తప్ప ఏనాడు సన్న, చిన్నకారు రైతులకు లబ్ధిచేకూర్చాలనే ఆలోచన చేయలేదు. దీంతో గడచిన టీడీపీ ఐదేళ్ల పాలనలో సగటున 20.28 లక్షల మంది రైతులు మాత్రమే 23.57 లక్షల హెక్టార్లకు బీమా చేయించుకోగలిగే వారు. తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్‌ స్కీమ్, ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలుచేశారు. దీనికింద 2016–17లో 20.44 లక్షల హెక్టార్లు (17.79 లక్షల మంది), 2017–18లో 24.28 లక్షల హెక్టార్లు (18.22 లక్షల మంది), 2018–19లో 25.99 లక్షల హెక్టార్లకు (24.83 లక్షల మంది) బీమా చేయించుకోగలిగారు.

ప్రీమియం రూపంలో ఈ మూడేళ్లలో రైతులు చెల్లించిన ప్రీమియం.. 2016–17లో రూ.347.96 కోట్లు, 2017–18లో రూ.261.29 కోట్లు, 2018–19లో రూ.262.42 కోట్లు చెల్లించారు. హుద్‌హుద్‌ వంటి పెను తుపానుతో సహా కరువు కాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు టీడీపీ ఐదేళ్లలో దక్కిన పరిహారం రూ.30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే. 2014–16 మధ్య అగ్రీ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద 5.38 లక్షల మందికి రూ.671.94 కోట్ల బీమా దక్కితే.. 2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47లక్షల మందికి రూ.2,739.26కోట్ల బీమా దక్కింది. కానీ, ఈ వాస్తవాలపై ఈనాడులో ఏనాడు చిన్న వార్త కూడా రాసిన పాపాన పోలేదు. 

పైసా భారం పడకుండా ఉచితంగా బీమా..
ఇక రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూలై 8న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఈ–పంట’లో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింపజేస్తోంది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. ఈ తరహా స్కీమ్‌ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడాలేదని బీమా రంగ నిపుణులే చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఐసీఎల్‌) ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించింది. ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్‌ పంటలకు సీజన్‌ ముగియకుండానే బీమా పరిహారం అందిస్తోంది.

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్‌లో 45.96 లక్షల హెక్టార్లు సాగుచేసిన 49.81 లక్షల మంది బీమా పరిధిలోకి రాగా, వారితో బీమా చేయించగలిగారు. అదేవిధంగా 2020–21లో 61.75 లక్షల హెక్టార్లు సాగుచేసిన 71.30 లక్షల మందీ బీమా పరిధిలోకి వచ్చారు. టీడీపీ హయాంతో పోల్చుకుంటే 198.57 శాతం రైతులు.. 128.51 శాతం విస్తీర్ణం పెరిగింది. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి కేవలం రూ.3,411.20 కోట్ల పరిహారం మాత్రమే చెల్లిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలోనే ఏకంగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పంటల బీమా చెల్లించింది. అంతేకాక.. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. కానీ, ఇవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధిచేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. 

రికార్డు స్థాయిలో పరిహారం ఇవ్వడమే నేరమా?
సాధారణంగా నోటిఫై చేసిన పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారంగానే నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం ఇస్తారు. ఇది అందరికీ  తెలిసిన విషయమే. ఇలా దిగుబడి ఆధారంగా 22, వాతావరణ ఆధారిత 9 పంటలకు బీమా వర్తిస్తుంది. గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌గా నోటిఫై అయిన దిగుబడి ఆధారిత పంటలకు గడిచిన ఏడేళ్ల సగటు దిగుబడి కంటే వాస్తవ దిగుబడి తక్కువగా ఉంటే నిర్ధేశించిన పరిహారాన్ని చెల్లిస్తారు. అలాగే.. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ, గాలి, డ్రైస్పెల్‌ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సగటు దిగుబడి కంటే తక్కువ దిగుబడి వచ్చే వాతావరణ ఆధారిత పంటలకు బీమా చెల్లిస్తారు.

ఈ వాస్తవాలు ఈనాడుకు తెలియనివి కాదు. ఇక ఖరీఫ్‌–21లో రికార్డుస్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు 36.99 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న 26 పంటలకు రూ.2,977.82 కోట్ల పరిహారాన్ని ప్రస్తుత వైఎస్సార్‌సీపీ సర్కారు అందించింది. ఈ సీజన్‌లో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 8.48 లక్షల మంది రైతులకు రూ.2,143.85 కోట్ల మేర బీమా చెల్లిస్తే, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి 7.13 లక్షల మంది రైతులకు రూ.833.97 కోట్ల పరిహారం చెల్లించారు.

అలాగే, ఖరీఫ్‌–21లో సాగైన నోటిఫైడ్‌ పంటల విస్తీర్ణంలో దాదాపు సగానికిపైగా విస్తీర్ణానికి పరిహారం దక్కింది. ఇలా ఒక సీజన్‌లో ఇన్ని లక్షల మంది రైతులకు ఇంత పెద్దఎత్తున పరిహారం ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కానీ, ఇవేమీ రామోజీకి కనిపించవు. కారణం చంద్రబాబు సీఎంగా లేరు కాబట్టి. వాస్తవాలు ఇలా కళ్లెదుట కన్పిస్తుంటే.. టీడీపీ హయాంలో అరకొరగా పరిహారం దక్కినా నోరుమెదపని రామోజీ నేడు ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతూ నిత్యం రోతరాతలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. సీజన్‌ ముగిసే వరకు ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీకి అవకాశం కల్పించినప్పటికీ ఈ–పంట, ఈ–కేవైసీకి పొంతన లేదంటూ కాకిలెక్కలతో పొంతన లేని రాతలు రాస్తున్నారు.

పంటల బీమాలో అగమ్యగోచరమేమీ లేదు
ఖరీఫ్‌–2021 సీజన్‌కు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నోటిఫై చేసిన పంటలను సాగుచేస్తూ ఈ–పంటలో నమోదై ఈ–కేవైసీ చేయించుకున్న సాగుదారులందరికీ డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేశాం. సాగుచేసిన పంట వివరాలు, ఆధార్‌ వివరాలతో పాటు ఆర్బీకేల్లో తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని రైతులను చైతన్యపర్చాం. ఈ–పంటలో నమోదైన జాబితాను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించాం. పారదర్శకతపై ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? గుంటూరు జిల్లాలో వర్షాధారంగా సాగుచేసిన మిరపపంటను వాతావరణ బీమా పథకం ద్వారా కొత్తగా ఈ ఏడాది గుర్తించినట్లుగా అవాస్తవాలను ప్రచురించడం సరికాదు. వాస్తవానికి 2016 నుంచే మిరపను వర్షాధార పంటగా ప్రకటించారు. దీంతో ఆ పంటకూ వాతావరణ ఆధారంగానే బీమా పరిహారం లెక్కించి మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించాం. ఈ జాబితాలను సంబంధిత ఆర్బీకేల్లో ప్రదర్శించాం. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పంటల బీమా పరిహారాన్ని విడుదల చేసి రైతులను ఆర్థికంగా ఆదుకుంటే తప్పుడు కథనాలతో రైతులను గందరగోళపర్చడం సరికాదు.
– చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు