కోళ్ల పెంపకంతో వేల ఆదాయం

29 Mar, 2021 14:06 IST|Sakshi

రూ. 45 వేలతో మూడు అంతస్థుల గుడ్ల కోళ్ల పంజరం 

7.5 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు

120 గుడ్లుపెట్టే కోళ్ల పెంపకం.. నెలకు రూ.10 వేల నికరాదాయం

పెరట్లో పశువుల పాక/షెడ్డులో ఏర్పాటు చేసుకోవచ్చు

నిర్వహణ సులభం.. గ్రామీణులకు నిరంతర ఆదాయ మార్గం

యువ పశువైద్యుడి ఆవిష్కరణ.. ఇప్పటికే 80 యూనిట్ల ఏర్పాటు 

గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఆదాయం పొందే మార్గాలు చూపగలిగితే పొట్ట చేతపట్టుకొని పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి ఉండదు. గ్రామంలోనే ఉంటూ రోజువారీ కొద్ది పాటి శ్రమతో, కొద్దిపాటి పెట్టుబడితో నిరంతరం ఆదాయం పొందే మార్గాన్ని సూచిస్తున్నారు యువ పశువైద్యుడు డా.ఆవుల సాయి మహేష్‌రెడ్డి. యువతకే కాదు వృద్ధులకూ ఉపయోగపడేలా సులభమైన రీతిలో చేయగలిగే మంచి ఉపాయం ఆలోచించారు. పెరట్లోనే గుడ్లు పెట్టే కోళ్ల పెంపకానికి ఉపయోగపడే చిన్నపాటి పంజరాన్ని రూపొందించారు. ఇప్పటికే 80 మంది ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకొని నెలకు రూ. పది వేల నికరాదాయాన్ని పొందుతుండటం విశేషం. 

గుంటూరు జిల్లా నెకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామానికి చెందిన ఆవుల సాయి మహేష్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. కృష్టా జిల్లా గన్నవరం కళాశాలలో పశువైద్యంలో గ్రాడ్యుయేషన్‌ అనంతరం హైదరా బాద్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 2017లో ఈపూరు మండలం ముపాళ్లలో పశువైద్యునిగా ఉద్యోగంలో చేరారు. గేదెలను పోషిస్తూ పొట్ట పోసుకునే రైతు కుటుంబాలు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో గేదెలను అమ్మివేసి పట్టణాలకు పొట్ట చేతపట్టుకొని వలస పోతున్న సందర్భాలలో ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపితే మేలు జరుగుతుందని భావించిన మహేష్‌రెడ్డి గుడ్లు పెట్టే 120 కోళ్లను పెరట్లో సునాయాసంగా పెంచుకోవడానికి వీలయ్యే ‘త్రీ టైర్‌ కేజ్‌ సిస్టమ్‌’ను రూపొందించారు. మొదటిగా తమ పెరట్లోనే ఏర్పాటు చేశారు. వయోవృద్ధుడైన తన తండ్రే దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ముప్పాళ్ల మండలంలోనే కాదు అనేక జిల్లాల్లో ఇప్పటికే 80 మంది వరకూ ఈ కేజ్‌ని ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారని మహేష్‌రెడ్డి తెలిపారు. 

గేదెను కట్టేసే చోటు చాలు.. 
కొష్టంలో లేదా షెడ్‌లో పాడి గేదెను కట్టెయ్యడానికి 8 అడుగులు వెడల్పు, 8 అడుగుల పొడవున స్థలం అవసరమవుతుంది. గేదెలను అమ్మేసుకున్నప్పుడు ఆ షెడ్‌ ఖాళీగానే ఉంటుంది. ఆ చోటులో పెట్టుకోదగిన విధంగా తాను గుడ్లు పెట్టే కోళ్లను పెంచుకునే మూడు అంతస్థుల పంజరానికి మహేష్‌రెడ్డి రూపకల్పన చేశారు. దీని పొడవు 7.5 అడుగులు, వెడల్పు 7 అడుగులు, ఎత్తు 7 అడుగులు ఉంటుంది. ఒక వైపు 3 కానాలు, రెండో వైపు మరో 3 కానాలను కోళ్ల కోసం ఏర్పాటు చేశారు. దీనికిపైన 20 లీటర్ల ఫైబర్‌ ట్యాంకు ఏర్పాటు చేశారు. రోజూ దీన్ని నింపితే చాలు. ఆ నీరు కోళ్లకు అందుబాటులోకి వస్తాయి. 

రోజుకు 110 గుడ్ల ఉత్పత్తి
18-19 వారాల వయసులో కోడి గుడ్లు పెట్టటం ప్రారంభిస్తుంది. ఆ వయసులో ఉన్న 120 కోళ్లను పెంచుకోవటం ప్రారంభిస్తే సుమారు సంవత్సర కాలం పాటు అవి గుడ్లు పెడతాయి. ఆ కోళ్లను అమ్మేసి.. మళ్లీ గుడ్లు పెట్టే వయసున్న కోడి పెట్టలను కొనుక్కొని పంజరంలో పెంచుకోవచ్చు. తెల్లని లేదా గోధుమ రంగులో పెట్టలను పెంచుకోవచ్చు. తెల్ల కోళ్లయితే గుడ్ల ఉత్పత్తి 95% వరకు ఉంటుంది. గోధుమ రంగులో కోళ్లయితే గుడ్ల ఉత్పత్తి 83% మేరకు ఉంటుందని మహేష్‌రెడ్డి వివరించారు. 120 కోళ్లలో రోజుకు కనీసం 110 గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. 

నిర్వహణ చాలా సులభం
కోళ్లను పంజరంలో ఉంచే పెంచాలి. బయటకు వదిలే అవసరం లేదు. తెల్లవారుజామున 4.30 – 5 గంటల మధ్యలో లైటు వేయాలి. అప్పుడు 4.5 కిలోల దాణాను 120 కోళ్లకు వేయాలి. పంజరం పైన 6 అడుగుల ఎత్తులో అమర్చిన చిన్న ట్యాంకులో 20 లీటర్ల నీరు పోయాలి. కోళ్లు ముక్కుతో పొడిస్తే నీరు అందుబాటులోకి వచ్చి వాటి దాహం తీర్చే ఏర్పాటు ఈ పంజరంలో ఉంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మరో 4.5 కిలోల దాణాను వేయాలి. రాత్రి 8.30 గంటలకు లైట్లు తీసివేయాలి.. అంతే. నేలకు కొంత ఎత్తున కోళ్లు పంజరంలో ఉంటాయి కాబట్టి పాములు, కుక్కల బెడద ఉండదు. 

ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపాటి కోళ్ల ఫారాన్ని నిర్వహించడం పెద్ద కష్టం ఏమీ ఉండదు. గుడ్లను ఇంటి దగ్గరే స్వయంగా అమ్ముకోవచ్చు. ఇటువంటి పంజరాలు ఒక్కరే నాలుగైదు ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా చిన్నపాటి యూనిట్లు స్థాపించే యువకులు, రైతులకు ప్రభుత్వం నుండి ప్రోత్సహం లభిస్తుందని డాక్టర్‌ మహేష్‌రెడ్డి తెలిపారు. తన దగ్గరకు వచ్చిన యువతకు ఇలాంటి పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంతోపాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో 80 వరకు యూనిట్లు ఇప్పటికే విజవంతంగా నడుస్తుండటం విశేషం.
- ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి అమరావతి బ్యూరో, గుంటూరు

వృద్ధులైనా నిర్వహించుకోవచ్చు!
గుడ్లు పెట్టే వయసున్న 120 కోళ్లతో పాటు మూడు అంతస్థుల కేజ్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలంటే రూ.45,000 వరకు ఖర్చవుతుంది. ఇనుప (వెల్డు) మెష్‌తో కోళ్ల బుట్టలను అల్లే వారు గ్రామాల్లో అక్కడక్కడా ఉంటారు. వాళ్లయినా ఈ పంజరాన్ని తయారు చేయగలుగుతారు. అలా చేయించుకుంటే రూ.30-35 వేలలోనే పూర్తవుతుంది. ఒక గేదెకు సరిపోయే స్థలం ఈ పంజరానికి సరిపోతుంది. రోజుకు కోడికి 80 గ్రాముల దాణా అవసరం. 120 కోళ్ల పెంపకం ద్వారా రోజూ 110 గుడ్ల ఉత్పత్తి ఏడాది వరకు పొందవచ్చు. ఇంటి దగ్గరే గుడ్డు రూ. 5 చొప్పున అమ్ముకోవచ్చు. దాణా ఇతరత్రా ఖర్చులు పోను ఒక్కో పంజరం నుంచి రూ. పది వేల నికరాదాయం వస్తుంది. యువతకే కాదు వృద్ధులకూ ఇది ఉపయోగకరమే. సునాయాసంగా ఈ పనులు చేసుకోవచ్చు. 
- డాక్టర్‌ ఆవుల సాయి మహెష్‌రెడ్డి (95338 91604), పశువైద్యులు, ముప్పాళ్ల, గుంటూరు జిల్లా 
 

>
మరిన్ని వార్తలు