కలలు కల్లలు.. భార్యా, భర్తల బలవన్మరణం

25 Jun, 2022 21:19 IST|Sakshi
నాగిరెడ్డి, స్వర్ణకుమారి దంపతులు (ఫైల్‌)

దుబాయ్‌ వెళ్లలేకపోయానని భర్త ఆత్మహత్య 

అది చూసి భార్య బలవన్మరణం   

అనాథలైన ఇద్దరు కుమారులు

తిరువూరు రూరల్‌ (ఎన్టీఆర్‌ జిల్లా): పని కోసం దుబాయ్‌ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ విషయం తెలిసి తట్టుకోలేక అతడి భార్య కూడా బలవన్మరణం చెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.   

నిరాశ చెంది.. 
తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామానికి చెందిన గూడూరు నాగిరెడ్డి(38), స్వర్ణకుమారి(34) దంపతులకు ఇద్దరు కుమారులు. నాగిరెడ్డి స్థానికంగా ఓ రెడీమేడ్‌ వస్త్ర దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సరైన ఆదాయం లేకపోవడంతో నాగిరెడ్డి ఏదైనా పని కోసం దుబాయ్‌ వెళ్లాలనే ప్రయత్నంలో వీసా కోసం దరఖాస్తు చే శాడు. పలుమార్లు ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ సాంకేతిక కారణాలతో వీసా పొందలేకపోయాడు. సమయం, డబ్బు వృథా కావడంతో పాటు ఇక తాను విదేశాలకు వెళ్లే అవకాశం లేదని ఆందోళనకు గురైన నాగిరెడ్డి బుధవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

చదవండి: (తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..)

భర్త మృతిని తట్టుకోలేక.. 
గురువారం తెల్లవారుజామున తర్వాత భర్త మృతి విషయం తెలుసుకున్న భార్య స్వర్ణకుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. అంత్యక్రియలు పూర్తి కాకముందే ఆమె కూడా పురుగుమందు తాగింది. అపస్మారక స్థితికి చేరిన స్వర్ణకుమారిని గుంటూరు తరలించగా, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు