భార్య మృతి చెందిన అరగంట వ్యవధిలో భర్త కూడా..

26 Apr, 2021 11:30 IST|Sakshi
మాజీ కౌన్సిలర్‌ అంగాడ సరళాదేవి, వీరవెంకట సత్యనారాయణ దంపతులు (పాతచిత్రం)

గుండెపోటుతో మాజీ కౌన్సిలర్‌ సరళాదేవి దంపతుల మృతి 

అరగంట వ్యవధిలోనే తనువు చాలించిన వైనం

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): వివాహం జరిగినప్పటి నుంచి ఒకరికొకరు తోడూ నీడగా నిలిచిన ఆ దంపతులు మృత్యుఒడికి జంటగానే వెళ్లారు. రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ అంగాడ సరళాదేవి(64), ఆమె భర్త ఇంజినీర్, కాంట్రాక్టరు అంగాడ వీర వెంకట సత్యనారాయణ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజులుగా సత్యనారాయణ అనారోగ్యంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనపై బెంగతో శనివారం మధ్యాహ్నం సరళాదేవి అనారోగ్యానికి గురికావడంతో నగరంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయనకు సీరియస్‌గా ఉండడంతో వెంటనే సరళాదేవి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. అర్ధరాత్రి సమయంలో సరళాదేవి గుండెపోటుతో మృతి చెందగా, అరగంట వ్యవధిలో ఆమె భర్త సత్యనారాయణ కూడా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సరళాదేవి దంపతులు పార్థివదేహాలను ఐఎల్‌టీడీ సెంటర్‌లోని ఆమె ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

అంగాడ సరళాదేవి ఏసీవై రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో కౌన్సిలర్‌గా సేవలందించడంతో పాటు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలు మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయారు. సరళాదేవి దంపతులు పార్థివదేహాలను వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్, మాజీ వైస్‌ ఎంపీపీ నక్కా రాజబాబు, బీఎస్‌పీ పార్లమెంటరీ ఇన్‌చార్జి పట్నాల విజయకుమార్, వైఎస్సార్‌ సీపీనాయకులు, ఆమె అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సరళాదేవి కుమార్తె సత్య, కుమారుడు వంశీలను పరామర్శించారు.

చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. 
జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం.. 

మరిన్ని వార్తలు