అయ్యో పాపం.. నిమిషాల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ

25 Jan, 2021 09:49 IST|Sakshi

అనాథగా మారిన కొడుకు

కన్నీరుమున్నీరవుతున్న బంధువులు

శృంగవరపుకోట: ప్రేమంటే రెండు హృదయాల సంగమం. అదో అద్భుత అనుభవం. ఆ ఆనందానికి.. అనుబంధానికి శాశ్వతత్వం సమకూర్చేది పరిణయం. మమతానుభవాన్ని పదికాలాల పాటు చెరిగిపోని మమకారంగా మార్చేదే వివాహం. వాళ్లిద్దరూ అద్వితీయ అనుభూతులు రెండింటినీ సంపూర్ణంగా ఆస్వాదించారు. ప్రేమికులై.. ఆపై ఆలూమగలై అనురాగాన్ని చూరగొన్నారు. చక్కని కుటుంబాన్ని చూడముచ్చటైన జీవితాన్ని నిర్మించుకున్నారు. అయితే.. విధి ఊరుకోదుగా.. వాళ్లిద్దరినీ విడదీయబోయింది. ముందు ఆమెను.. ఆయన హృదయేశ్వరిని కబళించింది. కానీ వారిది జన్మజన్మల బంధం కదా..  ప్రియసఖి దూరమైతే..ఈ లోకమెందుకని ఆయన హృదయం భావించిందేమో కాసేపటికే తన ప్రియతమను వెతుక్కుంటూ దివ్యలోకాల దిశగా పయనించింది. ప్రేమంటే ఇదేనని ప్రపంచానికి ఈ అనురాగం చాటిచెప్పింది. కానీ.. అమ్మానాన్నలు కళ్లెదుట దూరమైన దురదృష్టంతో.. వారి కుమారుడిని దుఃఖ సముద్రం ఉప్పెనలా ముంచెత్తింది. 
 
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన అద్దంకి మనోహర్‌ (56), భార్య సూర్యప్రభావతి (48)లు ఎస్‌.కోట పట్టణంలో స్థానిక పందిరప్పన్న కూడలిలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మనోహర్‌ ఎస్‌.కోట ఎల్‌ఐసీ కార్యాలయంలో డీఓగా విధులు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల కిందట ఎస్‌.కోట వచ్చి సొంత ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి డిగ్రీ చదువుతున్న కుమారుడు రామ్‌లిఖిత్‌ ఉన్నారు. శనివారం రాత్రి 1.30 సమయంలో భార్య ప్రభావతి బాత్రూమ్‌కి వెళ్లి అకస్మాత్తుగా పడిపోయింది. దీనిని గమనించిన భర్త మనోహర్, కొడుకు రామ్‌లిఖిత్‌లు బయటకు తీసుకొచ్చి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షణాల్లో వాహనం చేరుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభావతి చనిపోయినట్టు నిర్ధారించారు. భార్య మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేస్తూ భర్త మనోహర్‌ కొద్దిక్షణాల్లోనే గుండెపోటుతో కుప్పకూలిపోయి తనువుచాలించారు. భార్యభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు చనిపోవడంతో రామ్‌లిఖిత్‌ నిశ్చేషు్టడయ్యాడు. కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఇరుగుపొరుగు వారు చేరుకున్నారు. కాసేపటికి ఎల్‌ఐసీ సిబ్బంది వచ్చి మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం ఇద్దరి మృతదేహాలకు  అంతిమసంస్కారాలు పూర్తిచేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు