రేషన్‌ లబ్ధిదారులకు కూపన్లు

2 Mar, 2021 05:13 IST|Sakshi
నాణ్యమైన బియ్యాన్ని పరిశీలిస్తున కోన శశిధర్‌

విశాఖ పర్యటనలో లబ్ధిదారుల ఇబ్బందులు తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి శశిధర్‌

సాక్షి, అమరావతి: ఇంటింటా రేషన్‌ పంపిణీ చేసేందుకు మొబైల్‌ వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగానే సమాచారం ఇచ్చేందుకు ఈ నెల నుంచి కూపన్లు జారీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల ఫోన్‌ నంబర్లకు ఒక రోజు ముందుగానే సమాచారం పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇంటింటా సరుకుల పంపిణీకి సంబంధించి లోటుపాట్లను తెలుసుకునేందుకు ఆయన సోమవారం విశాఖపట్నంలో పర్యటించారు.

వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా ఇప్పటివరకు రేషన్‌ షాపు నుంచి ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత సరుకులు తీసుకునే సౌకర్యం ఉందన్నారు. అయితే దీనివల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి మంగళవారం నుంచి ఏ మొబైల్‌ వాహనం వద్దనైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద మ్యాపింగ్‌ కాని కార్డుదారులు కూడా వాహనాల వద్ద సరుకులు తీసుకోవచ్చన్నారు. కొన్ని చోట్ల ఇంటింటా వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి చోట్ల లబ్ధిదారులు ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు వచ్చి సరుకులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తగు సూచనలు జారీ చేశామన్నారు. పట్టణాల్లో  పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు.  

మరిన్ని వార్తలు