సంక్షేమం వద్దనడం రాజ్యాంగ విరుద్ధం

28 Aug, 2022 04:10 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న విజయ బాబు, కృష్ణంరాజు తదితరులు

‘ఎపిక్‌’ ఆధ్వర్యంలో చర్చావేదికలో పలువురి అభిప్రాయం 

రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ పథకాలపై కోర్టుల్లో కేసులు 

ఉచితాలకు, సంక్షేమానికి తేడా తెలుసుకోవాలి 

ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మందికి లబ్ధి 

పథకాలు రద్దు చేయాలనుకుంటే ఉద్యమాలు

సాక్షి, అమరావతి: ఆది నుంచి భారతదేశం సంక్షేమ రాజ్యమని, ఆధునిక ప్రజాస్వామ్యంలో సైతం అదే భావన అనుసరిస్తున్నామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పీఠికలోనూ సంక్షేమ భావన స్పష్టంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, కోవిడ్‌ కష్టకాలంలో ఈ పథకాలే ప్రజలను ఆదుకున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఇంటలెక్చువల్స్‌– సిటిజన్స్‌ ఫోరం (ఎపిక్‌) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ‘సంక్షేమ పథకాలు అభివృద్ధి సోపానాలా? నిరోధకాలా?’ అంశంపై జరిగిన ఈ చర్చలో పలువురు మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, హైకోర్టు న్యాయవాదులు, పాత్రికేయులు, పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతావని.. భారత రాజ్యాంగం సూచించిన సంక్షేమ రాజ్యంలో సగం కూడా చేరుకోలేదని, అయినా కొందరు రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ పథకాలు ఉచితాలని, వీటిని రద్దు చేయాలని కోర్టుకెక్కడం విచారకరమన్నారు. నాయకుల చిత్రపటాలకు వేలకొద్దీ లీటర్ల పాలతో అభిషేకం చేసే దేశంలో.. గుక్కెడు పాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు కూడా ఉన్నారనే విషయం గమనించాలని కోరారు. పాలకులు ప్రజల సంక్షేమం చూడాల్సిందేనని, అది వారి బాధ్యత అని పేర్కొన్నారు. 

కూడు, గూడు ప్రజల ప్రాథమిక హక్కు 
పాలకులు ప్రజలకు కూడు, గూడు ఇచ్చి సంక్షేమం చూడాల్సిందే. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కూడా అదే చెబుతున్నాయి. విమానాల్లో తిరిగినంత మాత్రాన అభివృద్ధి చెందామని, అందువల్ల సంక్షేమ పథకాలు వద్దనడం భావ్యం కాదు. టీవీ, ఫ్రిడ్జ్‌ వంటివి ఉచితాలు.   
– విజయబాబు, ఎపిక్‌ అధ్యక్షుడు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌

అధికారం కోసం పేదలను బలిచేయొద్దు 
కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మందికి రేషన్‌ సరుకులు అందిస్తోంది. అంటే ఆ స్థాయిలో నిరుపేదలు ఇంకా ఉన్నట్టే కదా! అభివృద్ధి చెందిన స్కాండినేవియన్‌ దేశాల్లో ఇప్పటికీ జాతీయాదాయంలో 70 శాతం విద్య, వైద్యంతో పాటు ప్రజల అభివృద్ధి పథకాలకు ఖర్చు చేస్తున్నారు.  
– కృష్ణంరాజు, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం  
కోవిడ్‌ లాంటి గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించి ఆదుకుంది. ఇలాంటి వాటిని ఉచితంగా ఇవ్వడం అంటూ కోర్టులు తప్పు పట్టడం సబబుకాదు. విద్యా దీవెన, నేతన్న నేస్తం, చేయూత, ఆసరా, పేదలందరికీ ఇళ్లు.. తదితర పథకాలు ఏ లెక్కనా ఉచితాలు కావు. ఏపీ ప్రగతిలో సంక్షేమ పథకాలు భాగం అని గుర్తించాలి. 
– పిళ్లా రవి, హైకోర్టు న్యాయవాది

ప్రజా సంక్షేమంపై కుట్ర! 
జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కోర్టుల ద్వారా కుట్ర జరుగుతోందనిపిస్తోంది. కొన్ని మీడియా వర్గాలు సంక్షేమ పథకాలను ఉచిత పథకాలని ప్రచారం చేయడం బాధాకరం. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఎవరైనా అడగ్గలరా? 
– అశోక్, లోక్‌సత్తా నేత 

మరిన్ని వార్తలు