రాగి జావ.. కొర్ర బువ్వ..జొన్న రొట్టె..!

8 May, 2021 15:28 IST|Sakshi

కరోనా నేపథ్యంలో పాతతరం ఆహారపు అలవాట్లపై ప్రజల ఆసక్తి

ఫాస్ట్‌ఫుడ్‌ను వదిలి.. ఇంటి భోజనంపై మక్కువ 

చిరు ధాన్యాల్లో పుష్కలంగా పోషకాలు 

రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు దోహదం 

జిల్లాలో క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం

రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి పలికి పాత తరం అలవాట్లకు జై కొడుతున్నారు. చిరు ధాన్యాల సాగు సైతం జిల్లాలో క్రమంగా  పెరుగుతోంది. ఇందుకు ప్రభుత్వం  ప్రోత్సాహమందిస్తోంది. 

కర్నూలు(అగ్రికల్చర్‌): కొర్రలు, వరిగలు, సామలు, రాగులు, సజ్జలు, జొన్నలు.. తదితర చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. వీటిలో శరీరానికి అవసరమైన పీచుపదార్థాలు, విటమిన్‌లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పోషక లోపాలు ఉత్పన్నం కాకుండా ఇవి ఒక కవచంలా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు వీటిని స్మార్ట్‌ ఫుడ్‌గా తీసుకుంటున్నారు. 

సాగుకు ప్రోత్సాహం..  
చిరు ధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మద్దతు ధరలను ప్రకటిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది.   వీటిపై పరిశోధనలు జరిపేందుకు వీలుగా కర్నూలులో చిరుధాన్యాల అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు, రాగులు.. మైనర్‌ మిల్లెట్‌ కిందకు, జొన్న, సజ్జ వంటివి మేజర్‌ మిల్లెట్‌ కిందకు వస్తాయి. రాయలసీమలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలులో వీటి సాగు ఎక్కువగా ఉంది. నాలుగేళ్ల క్రితం 25వేల హెక్టార్లలో ఉన్న సాగు నేడు 92 వేల హెక్టార్లకు విస్తరించింది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండడంతోపాటు చీడపీడలు బెడద లేకుండా దిగుబడి ఆశాజనకంగా వస్తుంది. అన్ని రకాల నేలల్లో వీటిని పండించవచ్చు. దీంతో జిల్లాలోని రైతులు చిరు ధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.   

ప్రయోజనాలివీ.. 

  • చిరు ధాన్యాల్లో ఇనుము, కాల్షియం, జింకువంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటితో చేసిన ఆహారం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  • కడుపులో అల్సర్లవంటి సమస్యలు ఉండవు. జీర్ణక్రియ బాగుంటుంది.
  • డయాబెటిస్‌ తదితర అనేక వ్యాధులు దరి చేరకుండా చేసుకోవచ్చు.
  • రాగులు..శరీరానికి అవసరమైన పోషక పదార్థాలతో పాటు ఎముకలకు కావాల్సినంత కాల్షియాన్ని అందిస్తాయి.
  • చిరుధాన్యాలపై నంద్యాలలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌(రీజినల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు. అలాగే 1,600 క్వింటాళ్ల విత్తనాలను కూడా సిద్ధం చేశారు. ఇందులో 1000 క్వింటాళ్ల కొర్రలు ఉన్నాయి.  

కరోనా నేపథ్యంలో.. 
కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ను వీడి.. పాత తరం ఆహారపు అలవాట్లపై మక్కువ చూపుతున్నారు. మంచి పోషకాలు లభించే చిరు ధాన్యాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి వంటను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటున్నారు. దీంతో మార్కెట్లో చిరు ధాన్యాల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. 

ఎంతో మేలు  
చిరు ధాన్యాలు  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పంటలు సాగు చేసే రైతులకు నికర ఆదాయం వస్తుంది. కొర్రపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నాం. తక్కువ వర్షపాతంలోనూ పంటను పండించేందుకు వీలుగా వంగడాలను రూపొందిస్తున్నాం.  – చంద్రమోహన్‌రెడ్డి, శాస్త్రవేత్త, ఆర్‌ఏఆర్‌ఎస్‌
  
వినియోగం పెరిగింది      
మా సంఘం ద్వారా గత ఏడాది 50 హెక్టార్లలో  చిరుధాన్యాల సాగు       చేపట్టాం. వచ్చే ఖరీఫ్‌లో 100 హెక్టార్లకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నాం. మేమే స్వంతంగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నాం. ప్రస్తుతం చిరుధాన్యాల వినియోగం రెట్టిపైంది. – వేణుబాబు,  ఏపీ విత్తన రైతు సేవా సంఘం అధ్యక్షుడు 

కొన్నేళ్లుగా అదే ఆహారం 
నా వయస్సు 75 ఏళ్లు. కొన్నేళ్లుగా రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్ర అన్నం తింటున్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. చిరుధాన్యాల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. – జి. పుల్లారెడ్డి, పందిపాడు, కల్లూరు మండలం  

చదవండి: రోగ నిరోధక శక్తి పెరగాలంటే చిరుధాన్యాలే సరి..!: ఖాదర్ వలి

మరిన్ని వార్తలు