మాతృదేవోభవ

31 Jul, 2020 11:46 IST|Sakshi
తాడేపల్లిగూడెం కోవిడ్‌కేర్‌ సెంటర్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన బస్సు

పశ్చిమగోదావరి,గణపవరం: మాతృదేవోభవ అనే పదానికి నిజమైన అర్థం చెప్పింది ఆ తల్లి.. తనకు కరోనా సోకినా.. బుద్ధిమాంధ్యంతో ఉన్న తన కొడుకు గురించే తల్లడిల్లింది. ఆ అమ్మ. ఈ హృదయవిదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో చోటుచేసుకుంది. గణపవరం రామాలయం వద్ద ఉండే ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకడంతో తాడేపల్లిగూడెం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉండడంతో వారికీ పరీక్షలు చేశారు. ఒక కొడుకు మానసిక వికలాంగుడు. వయసు 30 ఏళ్లు అతనికి అన్ని పనులూ తల్లే చేసేది.

ఈ నేపథ్యంలో తల్లి, మరో కొడుకుకు కరోనా సోకడంతో అధికారులు వారిద్దరినీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. అయితే బుద్ధిమాద్యం ఉన్న కొడుకు గురించే తల్లి మనసు గాబరా పడింది. తన కొడుకుకు సేవ చేసే భాగ్యం కల్పించాలని అధికారులను వేడుకుంది. దీంతో అధికారులు ఆమెకు హోం ఐసొలేషన్‌కు అనుమతిచ్చారు. ఆమెకు పీపీఈ కిట్‌ అందించి అది ధరించి కొడుకుకు సపర్యలు చేయాలని సూచించారు. బుద్ధిమాద్యం కల కుమారుడికి మరోమారు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. స్థానిక అధికారులు ఈ కుటుంబాన్ని పర్యవేక్షించాలని సూచించారు. వలంటీర్లద్వారా ఆమెకు అవసరమైన నిత్యావసర సరకులు, కూరగాయలు అందించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ను ఆదేశించారు.

మరిన్ని వార్తలు