పెండ్లి కుమారునికి పాజిటివ్‌... నిలిచిపోయిన పెళ్లి

24 Jul, 2020 10:35 IST|Sakshi

తూర్పుగోదావరి ,కొత్తపేట: ఇరవై నాలుగు గంటల్లో వివాహం జరగనున్న పెళ్లింట్లో కరోనా కలకలం సృష్టించింది. పెళ్లి నిశ్చితార్ధం అయింది. ఇరు కుటుంబాలు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించుకుని ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో పెళ్లి కుమారుడికి కరోనా పాజటివ్‌ అని నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా పడింది. కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన యువకుడికి ఇదే మండల పరిధిలోని బిళ్లకుర్రుకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 24న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. ఇరు కుటుంబాలు పెళ్లి శుభలేఖలు బంధువులకు పంచిపెట్టుకున్నారు. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఈలోగా పాజిటివ్‌ పడగై పెళ్లిని కాటేసింది. పెండ్లి కుమారుడు ఈ నెల 18న స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో కోవిడ్‌ టెస్ట్‌ల క్యాంపు నిర్వహించగా శ్వాబ్‌ టెస్ట్‌ శాంపిల్‌ ఇచ్చాడు.

పెండ్లి తంతులో భాగంగా గురువారం పెండ్లి కుమారుడిని చేయగా అదే రోజు టెస్ట్‌ రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో వారందరూ ఉలిక్కిపడ్డారు. దాన్ని గోప్యంగా ఉంచి ప్రైవేట్‌గా టెస్ట్‌ చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. అయితే దీన్ని అధికారికంగా నిర్ధారించకపోవడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలా? లేక పాజిటివ్‌ రిపోర్టు ఆధారం చేసుకుని పెళ్లి వాయిదా వేయాలా? అనే సందిగ్దావస్థలో బంధువులు కొట్టుమిట్టాడుతున్నారు.  మరోసారి టెస్ట్‌ చేయించుకుని దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు వరుడిని అమలాపురం తీసుకువెళ్లి శాంపిల్స్‌ ఇచ్చినా అక్కడ రిపోర్టు రావడానికి జాప్యం అవుతుందని వైద్యులు చెప్పడంతో పెళ్లి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దాంతో వధూవరుల తలలపై అక్షింతలు వేయాల్సిన ఆ రెండు కుటుంబాల పెద్దలు ఇప్పుడు పెళ్లి నిలిచిపోవడంతో తలలు పట్టుకున్నారు.  

>
మరిన్ని వార్తలు