సెంట్రల్‌ జైలులోనే ఖైదీలకు చికిత్స

8 Aug, 2020 10:19 IST|Sakshi
ఖైదీల ఆరోగ్యం విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించిన దృశ్యం

252 మందికి ఖైదీలకు వైద్య సేవలు

మెనూలో మార్పులు 

డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కోమల

రాజమహేంద్రరం క్రైం: పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మెడికల్‌ కిట్లను సమకూర్చింది. ఖైదీల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు జైల్‌లో ఉన్న వైద్యుడితో పాటు బయట నుంచి కూడా డాక్టర్లను పంపి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ వచ్చిన ఖైదీలకు పౌష్టికాహారంగా ప్రతిరోజు గుడ్డు, పాలు, పప్పు, ఆకు కూరలు, పెరుగు తదితర వాటిని మెనూలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. 

ప్రస్తుతం సెంట్రల్‌ జైల్‌లో 1,700 మంది ఖైదీలకు గాను, 1,200 మందికి కోవిడ్‌–19 పరీక్షలు చేశారు. మరో 400 మందిలో 200 మందికి గురువారం పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 200 మందికి పరీక్షలు నిర్వహించాలని, ఇప్పటికే పరీక్షలు చేసిన వారి ఫలితాలు రావలసి ఉందని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కోమల తెలిపారు.  

సెంట్రల్‌ జైల్‌ వైద్యుడికి పాజిటివ్‌ 
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో ఖైదీలకు చికిత్స అందించేందుకు ముగ్గురు వైద్యులు ఉన్నారు. వీరిలో ఒక వైద్యునికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కోమల పర్యవేక్షణలో ఖైదీలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అదనంగా మరో వైద్యుడిని ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్లు ఆమె తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్‌లో ఐసోలేషన్‌లో ఉంచామని డాక్టర్‌ కోమల తెలిపారు.   

ఎమర్జెన్సీ వైద్య సేవలకు ఏర్పాట్లు 
సీరియస్‌గా ఉన్న ఖైదీలకు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్‌ కోమల తెలిపారు. అవసరమైతే వారిని ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తామన్నారు. సెంట్రల్‌ జైల్‌లో పాజిటివ్‌ వచ్చిన ఖైదీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రతిరోజు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు