Kurnool: ఆడుతూ పాడుతూ.. ఆరోగ్యంగా ఇంటికి

10 May, 2021 10:44 IST|Sakshi
కర్నూలు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యం

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కోలుకుంటున్న కరోనా రోగులు

ఇప్పటి వరకు 4,444 మంది డిశ్చార్జ్‌ 

మెరుగైన సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలులోని రాజీవ్‌ నగర్‌కు చెందిన ఓ మహిళ(45)కు పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాలని ఆరోగ్య కార్యకర్తలు సూచించారు. ఇంట్లో సౌకర్యవంతంగా లేకపోవడంతో ఆమె భయం..భయంగానే జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఆమెకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించి.. ధైర్యాన్ని నింపింది. దీంతో ఆమె త్వరగా  కోలుకొని..ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. ఇలా జిల్లాలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇప్పటికే 60 శాతం మంది కోలుకున్నారు. మిగతా వారు కూడా త్వరలోనే కోలుకుని ఇంటికి వెళ్లనున్నారు.

కర్నూలు(సెంట్రల్‌): పాజిటివ్‌ వచ్చింది అనగానే చాలా మంది భయపడి పోతున్నారు. మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కొందరు గుండెపోటుకు గురై మృత్యువాత పడి..కుటుంబ సభ్యులకు అంతులేని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, సకల సదుపాయాలు కల్పించింది. ఇక్కడికి వచ్చిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో జిల్లాలో ఇప్పటి వరకు ఐదు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 4,444 మంది స్వస్థత పొంది ఇంటికి వెళ్లిపోయారు. మరో 2,515 మంది కోలుకుంటుండగా..370 మంది మెరుగైన వైద్యం కోసం కోవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

60 శాతం మంది డిశ్చార్జ్‌... 
జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు టిడ్కో గృహాలను తాత్కాలికంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. ఇటీవల సున్నిపెంటలోనూ మరొక దాన్ని ప్రారంభించారు. అన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మొత్తం 5,855 పడకలను ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 7,329 మంది చేరారు. వీరిలో 60.63 శాతం మంది ఇప్పటికే కోలుకొని ఇంటికి వెళ్లారు. 

మనో ధైర్యాన్ని నింపుతూ.. 
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో రోగులకు మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఇక్కడికి వచ్చిన వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని, అందుకు సంబంధించిన మందులను ఇచ్చి వైద్యులు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీ మాస్టార్లతో యోగా, ధ్యానం నేర్పిస్తారు. వివిధ ఆటలు ఆడిస్తారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ప్రతి రోగి ఆరోగ్యంపై ఆరా తీస్తారు. అందుకు తగ్గట్లుగా మందులను ఇస్తారు. ఆటపాటలతో వారిలో రోగాన్ని తరిమేసి 8 నుంచి 10 రోజుల్లోపు మామూలు మనిషిగా తయారు చేసి ఇంటికి పంపిస్తారు.  

ఇంటిని మైమరపిస్తూ.. 
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇంటిని తలపించే వాతావరణం ఉంటుంది. వేళకు రుచికరమైన భోజనం అందుతుంది. నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. కోతల్లేకుండా గదులకు కరెంట్‌ సరఫరా ఉంటుంది. కర్నూలు, ఆదోని, నంద్యాలలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో రోగులకు మినరల్‌ వాటర్‌ను అందిస్తున్నారు. సైకాలజిస్టులను కూడా ఏర్పాటు చేశారు. క్రీడలు ఆడడానికి అనువైన వాతావరణం ఉంటుంది. అత్యవసరానికి అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి.  

మనో ధైర్యాన్ని ఇస్తున్నారు 
నాకు కరోనా పాజిటివ్‌ రావడంతో వైద్యుల సలహా మేరకు టిడ్కో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపారు. అక్కడకు వెళ్లేందుకు మొదట కొంచెం భయం వేసింది. అక్కడికి వెళ్లిన తర్వాత భయం పోయింది. డాక్టర్‌  క్లింటన్‌ చక్రవర్తి నాలో మనోధైర్యాన్ని నింపారు. రెండు రోజుల్లో నయమవుతుందని చెప్పారు. మందులు రాసి వార్డు బాయ్‌తో నాకు కేటాయించిన గదికి తీసుకెళ్లమని చెప్పారు. యోగా, ధ్యానం, వాకింగ్‌ చేయించారు. ఆటలు ఆడించారు. ఆరోగ్యంగా కోలుకొని నేను ఇంటికి వచ్చాను. – పఠాన్‌ తన్వార్, ఆత్మకూరు 

అన్ని సౌకర్యాలు ఉన్నాయి  
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇక్కడ 24 గంటలపాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. వైరస్‌ సోకిన వారు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లకుండా వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ  ఆహ్లాదకర వాతావారణంలో రోగాన్ని నయం చేస్తారు. – ఎంకేవీ శ్రీనివాసులు, జేసీ 

 కోవిడ్‌ కేర్‌ సెంటర్‌     పడకలు            చేరిన రోగులు    డిశ్చార్జీలు        ప్రస్తుతం ఉన్న వారు  
   ఆదోని                    1,602                  1,400       842              454     
    కర్నూలు              1,746                    2,678    1,659           937     
    నంద్యాల              1,500                     2,331    1,430          809     
    ఎమ్మిగనూరు        933                        839       494            268     
    సున్నిపెంట            74                         81         19             47     
    మొత్తం                5,855                    7,329    4,444         2,515 

చదవండి: పేషంట్‌కు ఎంతో కీలకమైన ఆక్సిజన్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేయండి!

మరిన్ని వార్తలు