లక్షమందికి కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఆసరా

18 Oct, 2021 03:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సెకండ్‌ వేవ్‌లో బాధితులకు భరోసా ఇచ్చిన కేంద్రాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లు పేదలకు పెద్ద ఆసరాగా నిలిచాయి. ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అయితే ఐసొలేషన్‌లో ఉండటం సాధ్యం కాదు. చిన్న ఇల్లు ఉండే కుటుంబాల్లో ఇది ఏమాత్రం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో మూడు పూటల పోషకాహారం, మందులు ఇచ్చి అక్కడే బస ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లు లక్షమందికిపైగా ఆశ్రయం కల్పించాయి. ఈ కేంద్రాల్లో ఒక్కో పేషెంటుకు భోజనానికే ప్రభుత్వం రూ.500 వెచ్చించింది. తాజాగా కేసులు తగ్గిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మినహా ఏ జిల్లాలోనూ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులు లేరు.

రాష్ట్రవ్యాప్తంగా 130 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 52,851 పడకలు ఏర్పాటు చేశారు. ఈనెల 15 నాటికి ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే 15 మంది బాధితులు కోవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఉన్నారు. మిగతా ఏజిల్లాలోనూ ఒక్క పేషెంటు కూడా కోవిడ్‌ కేంద్రాల్లో లేరు. సెకండ్‌ వేవ్‌లో అక్టోబర్‌ 15 వరకు 1,01,103 మంది కోవిడ్‌ కేంద్రాల్లో చేరినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24,883 మంది ఈ కేంద్రాలకు వచ్చారు. 13,821 మంది బాధితులు గుంటూరు జిల్లాలో చికిత్సకు వచ్చారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,188 మంది బాధితులు కోవిడ్‌ కేంద్రాలకు వచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 52 వేలకు పైగా పడకలు ఏర్పాటు చేసింది.  

మరిన్ని వార్తలు