దుర్గమ్మ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్

28 Nov, 2020 12:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అమ్మవారి మాల ఎక్కడైతే స్వీకరిస్తారో అక్కడే దీక్ష విరమణ చేయాలని దుర్గగుడి ఈఓ సురేష్‌ బాబు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నదీ స్నానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. కాగా కోవిడ్‌ నిబంధనల కారణంగా భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ బ్రేక్ పడింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు భవానీ దీక్షా విరమణ ఆన్‌లైన్‌ స్లాట్‌ను శనివారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఈఓ సురేష్‌ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. జనవరి 5 నుంచి 9 వరకు భవానీ దీక్షా విరమణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా భవానీ దీక్షకు వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షణను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘దీక్షా విరమణ రోజుల్లో రోజుకు 9 వేల మందికి ఉచిత దర్శనం... 100 రూపాయల టిక్కెట్లు 1000 ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. 

ప్రతిభక్తుడు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో ఐడీ తప్పనిసరి. www.kanakadurgamma.org వెబ్‌సైట్‌లో టిక్కెట్లు పొందవచ్చు. దీక్షా విరమణ రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. కాగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు ఆలయ సిబ్బందితో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి గిరిప్రదక్షిణ చేయనున్నారు.(చదవండి: మూడు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు)

మరిన్ని వార్తలు