Covid Time: నేస్తమా.. నువ్వచట కుశలమా..! 

18 Jun, 2021 16:06 IST|Sakshi

ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం ఆరాటం 

పాత స్నేహాలు, బంధుత్వాల పునరుద్ధరణకూ యత్నం 

కరోనా మహమ్మారి నేపథ్యంలో అనుబంధాలకు పెరిగిన ప్రాధాన్యం 

‘సతీష్‌ ఉద్యోగంతో బాగా బిజీ.. కరోనాతో సగం రోజు డ్యూటీయే గనుక బాగా ఖాళీ దొరికింది. టీవీ బోరు కొడుతోంది. అందులో కరోనా సెకండ్‌వేవ్‌తో ఆత్మీయ మిత్రులు, బంధువులు పిట్టల్లా రాలిపోతుండడం గమనిస్తున్నాడు. మనసు విలవిల్లాడింది. అన్నీ ఉండి అంత్యక్రియలకు కూడా నోచుకోని వారిని.. చివరి చూపు కూడా దక్కని వారిని గమనిస్తున్నాడు. మనసు మొద్దుబారి స్తబ్దత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు పాత మిత్రులు ఫోన్‌ చేసి కుశలం అడిగారు. తను కూడా బాగా గ్యాప్‌ వచ్చిన కొందరు ఆత్మీయులకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వారితో మాట్లాడుతుంటే ఏదో తెలియని కొత్త సైన్యం తోడుగా నిలుస్తున్నట్లు అనిపిస్తోంది. నెల రోజులుగా అదే పనిగా బంధుమిత్రుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాడు. ఇక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కనీస పలకరింపులకు గ్యాప్‌ రాకుండా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు’. 

కడప కల్చరల్‌: కరోనా మనలో చిన్నచిన్న మార్పులు తెస్తోందంటున్నారు పలువురు మనస్తత్వ నిపుణులు. ప్రస్తుత సెకండ్‌ వేవ్‌ పరిణామాలను గమనిస్తే పలువురిలో మంచితనం మేల్కొంటోందని పేర్కొంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంతటి నరకాన్ని చూపించిందో అదేవిధంగా మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేందుకు మార్గం చూపిందంటున్నారు. కరోనా కారణంగా చాలామంది ఇంట్లోనే ఉంటూ నంబర్లు సేకరించుకుని మరీ ఎప్పుడో మరిచిపోయిన బంధుమిత్రులకు ఫోన్లు చేసుకుంటున్నారు. సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో వారి యోగక్షేమాల గురించి వాకబు చేస్తున్నారు. ఈ బంధాలు పునరుద్ధరించుకుంటుంటే అందులోని ఆనందం, వాటి ద్వారా కలిగే ఆత్మస్థైర్యం విలువ తెలిసి వస్తోంది. భౌతిక దూరమంటూ మనుషులు దూరంగా ఉన్నా ఫోన్‌ ద్వారా మనసులు దగ్గరవుతున్న ఆనందం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

కరోనా వల్ల  ఆకస్మికంగా అయిన వారినీ, ఉపాధినీ కోల్పోయిన కొందరు తమకు జన్మనిచ్చిన పల్లెతల్లి ఒడికి చేరుతున్నారు. బంధువుల ఆత్మీయత, ఆసరాలతో ఆత్మస్థైర్యం కూడగట్టుకుంటున్నారు. ఉపాధి కోల్పోయిన బంధుమిత్రులకు తిరిగి వారు కుదుట పడేంత వరకు నేస్తాలతో కలిసి వారి ‘జరుగుబాటు’కు సహకరించినప్పుడు వారిలో కనిపిస్తున్న కృతజ్ఞత హృదయాన్ని తడిపేస్తోంది. ఈ ఆనందానికి ఇంకేది సాటి రాదనిపిస్తోంది. పోగొట్టుకున్నదేదో తిరిగి లభిస్తున్నట్లు అనిపిస్తోంది. పైగా పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటున్నామన్న తృపి కలుగుతోంది. ఉరుకులు, పరుగుల జీవన యానంలో మరుగున పడిన ఆ ఆత్మీయతకు తిరిగి దగ్గరవుతుంటే ఏదో తెలియని ఆనందం. 

ఎలా ఉన్నారు నేస్తమా? 
సెకండ్‌ వేవ్‌తో అయిన వారి ఆకస్మిక మరణ వార్తలు మానసికంగా కుంగదీశాయి. ‘ఎవరెప్పుడో’ అన్న సందేహంతో ఉన్నంత వరకు ఉన్నవారితోనైనా ఆత్మీయత పంచుకుని ఆనందం పెంచుకోవాలన్న తపన. ఫలితంగా బంధుమిత్రుల యోగ క్షేమాల గురించి తెలుసుకునే యత్నాలు చేస్తున్నారు. వారితో సంబంధాలను పునరుద్ధరించుకుని ఉపశమనం పొందుతున్నారు. ధనం వల్ల వచ్చే ధైర్యాన్ని కరోనా నీరు గారుస్తుండడంతో (సాటి) మనుషుల విలువ తెలిసి వస్తోంది. తమ వారిని కాపాడుకోలేని నిస్సహాయత కుంగ దీస్తోంది. మిగిలిన వారితోనైనా ఆత్మీయంగా ఉండకపోతే జీవితంలో తమకంటూ ఆనందాన్ని ఇచ్చేందుకు ఒక్క మనిషి కూడా మిగలడన్న ఆందోళన కలుగుతోంది.

కుటుంబ సభ్యులందరూ కలిసి బంధుమిత్రులతో వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాల్స్, జూమ్‌ మీటింగులతో ఒకరినొకరు పలకరించుకుంటూ బంధాలను పదిల పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూ బంధుమిత్రుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండడం విశేషం. కొన్ని కులసంఘాలు, మిత్ర బృందాలు ‘మిత్రులారా..ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త! ఏం అవసరమొచ్చినా ఫోన్‌ చేయండి’ అంటూ ఆసరాగా నిలిచి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంపై కరోనా మానవ సంబంధాల విలువను పునరుద్ధరించుకునేలా చేస్తోందని, దీన్ని గుణపాఠంగా స్వీకరించి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని, మనిషిగా మెలగాలన్న ధోరణిని మెరుగు పరుచుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.  

మనిషి విలువ తెలుస్తోంది 
డబ్బుతో ప్రాణాన్ని కాపాడుకోవచ్చన్నది భ్రమ అని కరోనా సెకండ్‌ వేవ్‌ స్పష్టం చేసింది. కుబేరులకు సైతం అంత్యక్రియలు చేయడానికి సొంత మనుషులే ముందుకు రా(లే)కపోవడం ఆలోచన  రేకెత్తిస్తోంది. ‘అందరూ బాగుండాలి...అందులో నేనుండాలి’ అన్న భావనలు వస్తున్నాయి. బతికుండగానే బంధుమిత్రులందరితో కలిసిమెలిసి ఉండాలని భావిస్తున్నారు. స్పీడు జీవితంలో కనుమరుగవుతున్న ఆత్మీయ బంధాలను తిరిగి పొందాలన్న తపన పెరుగుతోంది. మనమేం కోల్పోతున్నామో క్రమంగా తెలియవస్తోంది. 
– ఓ.వెంకటేశ్వర్‌రెడ్డి, సైకాలజిస్టు, కడప

చదవండి: కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష 

మరిన్ని వార్తలు