ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్‌ చికిత్స ఏపీలోనే: సీఎం వైఎస్‌ జగన్‌ 

26 Nov, 2021 04:58 IST|Sakshi

బ్లాక్‌ ఫంగస్‌కూ ఆరోగ్యశ్రీ జాబితాలో చోటు

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల సాయం

సాక్షి, అమరావతి : ‘ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని మన కళ్లతో చూస్తున్నాం. కోవిడ్‌ వైద్యం వల్ల ప్రజలు నష్టపోకూడదని, ఇబ్బంది పడకూడదని ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మనదే’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఆరోగ్య రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

కోవిడ్‌ అనంతరం బ్లాక్‌ ఫంగస్‌ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే కూడా అటువంటి రోగాలను ఆరోగ్య శ్రీలోకి చేర్చిన మనసున్న ప్రభుత్వమని చెప్పారు. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను పీహెచ్‌సీలతో అనుసంధానం చేసి.. టెస్టింగ్, ట్రేసింగ్‌.. ట్రీట్‌మెంట్‌ ద్వారా కోవిడ్‌పై ఏ రకంగా యుద్ధం చేశామో రాష్ట్రమంతా చూశారన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..

  • వలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయంలోని ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి కోవిడ్‌ ఉందా? లేదా? అని అడిగి తెలుసుకోడానికి ఏకంగా 31 సార్లు సర్వే చేశారు. కోవిడ్‌ పరీక్షలు, ట్రీట్‌మెంట్లలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. నవంబర్‌ 23 నాటికి రాష్ట్రంలో మొత్తం 3.02 కోట్ల మందికి కోవిడ్‌ పరీక్షలు చేశాం. దేశం గర్వపడే విధంగా పరీక్షలు చేసిన అతి కొద్ది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. 
  • జాతీయ స్థాయిలో కోవిడ్‌ మరణాల రేటు 1.35 శాతం అయితే, మన రాష్ట్రంలో 0.70 శాతమే. కోవిడ్‌ వచ్చినా కూడా 99.3 శాతం మందిని మనం కాపాడుకోగలిగాం. కోవిడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఒక్కటి కూడా లేని పరిస్థితి నుంచి 19 ల్యాబ్‌లు 24 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. 
  • కోవిడ్‌ వైద్యం కోసం 20 నెలలుగా రూ.3,648 కోట్లు ఖర్చు చేశాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడే 108, 104 సేవలకు అర్థంచెప్తూ ఏకంగా 1,068 వాహనాలను సమకూర్చాం. 
  • రాష్ట్ర జనాభాలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 3,41,53,000. అంటే దాదాపు 87 శాతం మంది. 2 డోసులు తీసుకున్నవారు 2.39 కోట్ల మంది. అంటే దాదాపు 61 శాతం. కేంద్రం పంపిస్తున్న వ్యాక్సిన్ల షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌కి రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన వారికి 100 శాతం మందికి ఒకడోసు.. మార్చి నాటికి పూర్తిగా 2 డోసులు ఇస్తాం. కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసి, వారి ఆలనా పాలనా చూసుకునే ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. 
మరిన్ని వార్తలు