Corona: పట్టణాల్లో నియంత్రణలోనే కోవిడ్‌ 

6 Sep, 2021 03:10 IST|Sakshi

9,988 గ్రామ సచివాలయాల పరిధిలో ఒక్క కేసు కూడా లేదు 

రాష్ట్రంలో నాలుగు నగరాల్లోనే 200 కంటే ఎక్కువ కేసులు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పట్టణాల్లో వేలల్లో ఉన్న కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఇప్పుడు వందల్లోకి తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. మెజారిటీ పట్టణాల్లో వందకు లోపే కేసులు ఉన్నాయి. నాలుగు నగరాల్లో మాత్రమే 200 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 418, విజయవాడలో 348, ఒంగోలులో 345, నెల్లూరులో 261 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మునిసిపాలిటీల్లో చాలా వరకు కేసులు నియంత్రణలోకి వచ్చాయి.

21 మునిసిపాలిటీల్లో 100 లోపే కోవిడ్‌ కేసులు ఉండటం గమనార్హం. రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో 100–200 వరకు కేసులు ఉన్నాయి. ఇక గ్రామ సచివాలయాల వారీగా చూస్తే.. 9,988 సచివాలయాల పరిధిలో ఒక్క కేసు కూడా లేదు. 2,610 వార్డు సచివాలయాల పరిధిలో కేవలం 1 యాక్టివ్‌ కేసు మాత్రమే ఉంది. 1,065 సచివాలయాల పరిధిలో రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. 40–50 మధ్య కేసులున్న సచివాలయాలు కేవలం 2 మాత్రమే ఉన్నట్టు ఆరోగ్య శాఖ గణాంకాల్లో తేలింది. కోవిడ్‌ నియంత్రణలోనే ఉన్నప్పటికీ థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.   

మరిన్ని వార్తలు