ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’

14 May, 2021 08:39 IST|Sakshi
రామచంద్రాపురం కోవిడ్‌ కేర్‌ సెంటర్లో క్యారమ్స్‌ ఆడుతున్న బాధితులు-కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద బుర్రకథ ప్రదర్శన  

విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం)/శ్రీకాకుళం రూరల్‌: కోవిడ్‌ కేర్‌ సెంటర్లో కోవిడ్‌ బాధితులకు చికిత్సలో అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఆటలను అస్త్రంగా వాడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురంలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లో సుమారు 50 మంది బాధితులు ఉన్నారు. మొన్నటివరకు వీరిలో చాలామంది వ్యాధి వచ్చిందన్న మనోవేదనతో కుమిలిపోయేవారు. ఆహారం కూడా సరిగా తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కోవిడ్‌ కేర్‌ ప్రత్యేక అధికారి, నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు బాధితుల్లో ఎలాగైనా మనోధైర్యాన్ని నింపాలనుకున్నారు. వారి

మనస్సును ఆటల మీదకు మళ్లించగలిగితే వ్యాధి ఉందన్న భావన మనస్సులో నుంచి పోతుందని, దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. వెంటనే తన ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకున్నారు. బాధితులు ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వైకుంఠపాళి, దాయాలు, తదితర ఆట వస్తువులను సమకూర్చారు. మూడు పూటల భోజనం అనంతరం బాధితులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆడుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో నాలుగు రోజుల నుంచి బాధితులు ఆటల్లో నిమగ్నమైపోయారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లో ఆటలు సత్ఫలితాలనిస్తున్నాయని, గతంలో కంటే బాధితులు ఉత్సాహంగా ఉంటున్నారని, వారి ఆరోగ్యం కూడా వేగంగా మెరుగుపడుతోందని ప్రత్యేకాధికారిశ్రీనివాసరావు తెలిపారు. 

బుర్రకథ.. యోగా.. 
కోవిడ్‌ రోగులకు స్వాంతన కలిగించేందుకు శ్రీకాకుళం జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధిలోని పాత్రునివలస టిడ్కో కోవిడ్‌ కేర్‌ సెంటర్లో గురువారం బుర్రకథ ప్రదర్శన నిర్వహించారు. రోగుల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలిగించేందుకు వినోదభరిత కార్యక్రమాలతోపాటు ఉదయం పూట యోగా నిర్వహిస్తున్నట్లు నోడల్‌ అధికారి రవికుమార్‌ తెలిపారు.

చదవండి: కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు 
భారతి సిమెంట్‌ వితరణ 

మరిన్ని వార్తలు