ఏపీ.. నో పొల్యూషన్

8 Mar, 2021 03:35 IST|Sakshi

అత్యధిక కాలుష్య ప్రాంతాలు ఒడిశాలోనే.. 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్య ప్రాంతాలు లేవని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో అత్యధికంగా 23 కాలుష్య ప్రాంతాలతో ఒడిశా తొలి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌ (21), ఢిల్లీ (11) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాగా, తెలంగాణలో రెండు.. నూర్‌ మహ్మద్‌ కుంట లేక్‌ (కాటేదాన్‌), పటాన్‌చెరు (మెదక్‌) కాలుష్య ప్రాంతాలని నివేదిక తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో ప్రమాదకరమైన, ఇతర వ్యర్థాల వల్ల అనేక కలుషితమైన డంపింగ్‌ ప్రదేశాలు ఏర్పడ్డాయంది.

వీటివల్ల భూగర్భ, ఉపరితల జలాలు కలుషితమై ప్రజారోగ్య, పర్యావరణ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని పేర్కొంది. అశాస్త్రీయ పద్ధతిలో లేదా నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించి పారిశ్రామిక వ్యర్థాలను పారవేయడం వల్ల కలుషిత ప్రాంతాలు రూపొందుతున్నాయని తెలిపింది. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణపై నియంత్రణ లేనప్పుడు కాలుష్య ప్రాంతాలుగా మారుతున్నాయని వివరించింది. కాలుష్య నివారణ ఖర్చు సామర్థ్యానికి మించి ఉండడంతో చాలా ప్రాంతాలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయని వెల్లడించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు