ఎన్నికలప్పుడే పొత్తుల క్లారిటీ

6 Jun, 2022 05:56 IST|Sakshi

బీజేపీ, మోదీ విధానాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం 

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీల పొత్తులపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఉండదని, ఎన్నికల సమయంలోనే వాటిపై క్లారిటీ వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అప్పటి కూటమి, రాజకీయ సమీకరణల ఆధారంగా పొత్తుల విషయంలో సీపీఐ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని మోదీ పాలనలో సామాన్యులే ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారని, కార్పొరేట్‌ వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు. దేశంలో 14 మంది ప్రధానులు కలిసి రూ.40 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోదీ ఒక్కరే రూ.80 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో రూ.18 లక్షల కోట్ల బ్లాక్‌ మనీని మార్చుకున్నారని, 0.6 శాతం మాత్రమే మార్చకుండా వృధా అయిందని చెప్పారు. నోట్లరద్దు పేరుతో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఆరెస్సెస్, బీజేపీ ఖాతాల్లోకి చేరిందని ఆరోపించారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌తో దేశానికి జరిగిన నష్టంపై జాతికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, మోదీ విధానాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. 

మరిన్ని వార్తలు