తెలంగాణది కక్షసాధింపు ధోరణి

24 Oct, 2020 17:58 IST|Sakshi

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

పొలవరం డబ్బులు కేంద్రమే ఇవ్వాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

సాక్షి, విజయవాడ: ఆర్టీసీ వివాదంలో ఆంధ్రప్రదేశ్‌ ఇస్తోన్న వివరణ సరైనదే అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. శనివారం దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఐదేళ్ల పాటు ఉన్న ఒప్పందం ముగిసింది. దాంతోనే ఈ ఇబ్బంది తలెత్తింది. మేము ఎన్ని కిలో మీటర్లు తిప్పితే మీరు అన్నే తిప్పాలి అంటూ తెలంగాణ, ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. లక్ష 26 వేల కిలోమీటర్లు తిప్పుతున్న ఏపీ దానిని తగ్గించుకునేందు సైతం ముందుకు వచ్చింది. ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఏపీకి మూడు కోట్లు, తెలంగాణకు రెండు కోట్ల రూపాయల నస్టం వస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ తగ్గిస్తే ప్రజలకు ఉపయోగం అని ఏపీ ప్రభుత్వం ఆలోచన. ప్రైవేటు వారు బాగుపడిన ఫర్వాలేదు కానీ ఏపీకి లాభం రాకూడదన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఆర్టీసీ 400 రూపాయలు వసూలు చేస్తే.. ప్రైవేట్‌ ట్రావేల్స్‌ 1000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇరువురు సీఎంలు చొరవ తీసికోవాలి’ అని కోరారు. (చదవండి: టీఎస్‌ఆర్టీసీ కోరినట్లే ప్రతిపాదనలు పంపాం)

చంద్రబాబు తప్పు చేశాడు
‘విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ మూర్తి గారు ప్రభుత్వ భూమిని కొంత ఆసుపత్రి కోసం తీసుకున్నామని ఎప్పుడో చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రకారం ఫైన్ వేయవచ్చు.. చర్యలు తీసుకోవచ్చు కూల్చి వేయడం కరెక్ట్‌ కాదు. కట్టేటప్పుడు చూస్తూ ఉండి కట్టాక కూల్చేస్తున్నారు. విశాఖలో2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలో ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఏపీలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తారు. మోదీ ఏపీకి ఇచ్చిన హామీలు నిరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన డబ్బులు కేంద్రమే ఇవ్వాలి. ఇది జాతీయ ప్రాజెక్ట్‌.. పోలవరం కడతా అని చంద్రబాబు తప్పు చేశాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు 5వేల కోట్ల రూపాయలు జీఎస్టీ బకాయిలు రావాలి. కేంద్ర మంత్రులు రాష్టానికి వచ్చి అబద్దాలు చెప్పి పోతున్నారు’ అంటూ మండి పడ్డారు. (చదవండి: గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు)

మోదీ, ట్రంప్‌ నాటకరాయుళ్లు
‘ప్రపంచలోనే గొప్ప నాటకరాయుళ్లు, రాజకీయ కళాకారులు ట్రంప్, మోదీలు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు చనిపోతే.. బిహార్ ఎన్నికల్లో ఓట్లకోసం బిహార్ రెజ్మెంట్ అని మోదీ ప్రచారం చేస్తున్నారు. బిహార్ రెజ్మెంట్‌లో బిహారీలు ఒక్కరే  ఉండరు. తెలంగాణ వాసిని బిహార్ వాసిగా చెపుతున్నారు. ఇది జాతి ద్రోహం కాదా. నైతికంగా ఇంత దిగజారిన ప్రధానిని మేము చూడలేదు. శవాల మీద పేలాలు వేరుకునే తంతుగా అబద్దాలతో ఓట్లు అడుగుతున్నారు. ఓట్ల కోసం దేశాన్ని తప్పు దోవపట్టించే ఇలాంటి ప్రధానిని మేము చూడలేదు’ అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు