అబ్బురం.. దుర్గి హస్త కళావైభవం

13 Dec, 2020 04:33 IST|Sakshi

క్రీ.శ. 12వ శతాబ్దంలోనే శిల్పకళకు బీజం 

అద్భుత నైపుణ్యంతో బండరాళ్లకు సజీవ రూపాన్ని ఇస్తున్న శిల్పకారులు

దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లె పడుచుల విగ్రహాల తయారీ

దుర్గి శిల్పాలకు ఖండాంతర ఖ్యాతి.. 2017లో దుర్గి శిల్పాలకు జియోగ్రాఫికల్‌ గుర్తింపు

సాక్షి, గుంటూరు/మాచర్ల: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు’ అని సినీ కవి రాసిన పాటకు నిలువుటద్దంలా నిలుస్తున్నారు.. ఈ శిల్పకారులు. దేవ శిల్పి.. మయుడిని కూడా వీరు మరిపించగల నేర్పరులంటే అతిశయోక్తి కాదు. ఏ ఆకృతి లేని బండరాళ్లను తమ అద్భుత నైపుణ్యంతో సజీవశిల్పాలుగా మలిచే శిల్పకారులకు నెలవు.. దుర్గి. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం ఉలితో అద్భుత శిల్పాలను చెక్కే శిల్పకారులకు నిలయంగా భాసిల్లుతోంది. దుర్గిలో అడుగుపెడితే.. శాలివాహనులు, కాకతీయుల కాలం నాటి ప్రాచీన శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంటోంది. ఇక్కడ ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు, అవసరమైతే ఇంకా ఎత్తయిన శిల్పాలను చెక్కడంలో ఇక్కడి శిల్పులు సిద్ధహస్తులు. వీరు రూపొందించే వివిధ దేవతామూర్తులు, బుద్ధుడు, రాధాకృష్ణులు, పల్లె పడుచుల విగ్రహాల్లో కళా నైపుణ్యం తొణికిసలాడుతుంటోంది. 

12వ శతాబ్దంలోనే బీజం..
దుర్గి శిల్ప కళకు క్రీ.శ.12వ శతాబ్దంలోనే బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు పెందోట వాసి అని ఐతిహ్యం. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారు. ప్రకృతి వైపరీత్యమో, శత్రువుల దాడుల కారణంగానో 11వ శతాబ్దంలో ద్వారకాపురి కాలగర్భంలో కలిసిపోయింది. ఈ క్రమంలో ద్వారకాపురి నుంచి వలస వచ్చిన కొందరు శిల్పులు ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఆ ప్రాంతానికి ‘దుర్గి’గా నామకరణం చేశారు. 15వ శతాబ్దం నాటికి దుర్గిలో 300 మంది శిల్పులు ఉండేవారని తెలుస్తోంది. అమరావతి, నాగార్జునకొండల్లోని బౌద్ధ స్థూపాలను దుర్గి కళాకారులే మలిచారని చరిత్రకారులు చెబుతుంటారు. విజయపురి సౌత్, నాగార్జునకొండకు వచ్చే బౌద్ధులు దుర్గి గ్రామాన్ని సందర్శించి.. ఇక్కడి శిల్పులు మలచిన బౌద్ధ విగ్రహాలను కొని తీసుకెళ్తుంటారు. 

విదేశాలకు ఎగుమతి
కనుమరుగవుతున్న దుర్గి శిల్పకళను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో 1962లో అప్పటి ప్రభుత్వం దుర్గిలో శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రం ద్వారా వందల మంది శిల్ప కళలో శిక్షణ పొంది తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో రాణిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఇక్కడి విగ్రహాలు ఎగుమతి అవుతున్నాయి. 1984లో హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల ప్రదర్శనలో దుర్గి శిల్పులు చెక్కిన వాటిని మెచ్చుకున్న అప్పటి సీఎం ఎన్టీ రామారావు తర్వాత దుర్గిని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయానికి దశావతరాల విగ్రహాలను దుర్గి శిల్పకారులే అందించారు. తెలంగాణలోని బుద్ధ వనానికి విగ్రహాలను అందించిన దుర్గి కళాకారుడు శ్రీనివాసరావును ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సత్కరించారు. 2017లో దుర్గి శిల్పాలకు భారత ప్రభుత్వం ఇచ్చే జియోగ్రాఫికల్‌ గుర్తింపు లభించింది. ఇక్కడ మలిచే లైమ్‌ హార్డ్‌ రాయి విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. అరుదైన ఈ రాయి దుర్గి గ్రామంలోనే ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ క్వారీలోనే లభిస్తుందని శిల్పులు చెబుతున్నారు.

ప్రస్తుతం 15 కుటుంబాలే..
దుర్గి శిల్పకళ నానాటికి అంతరించిపోయే దిశగా అడుగులు వేస్తోందని ఇక్కడి శిల్పులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 300 కుటుంబాలు శిల్పకళలో ఉండగా ఇప్పుడు 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే శిల్పకళా శిక్షణా కార్యక్రమం కూడా ఆగిపోవడంతో కొత్తవారు రావడం లేదు. 

ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి
కరోనా వైరస్‌ ప్రభావం శిల్పకళా రంగంపై కూడా పడింది. పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఉత్పత్తులు సరిగా అమ్ముడుపోవడం లేదు. శుభకార్యాల సీజన్‌లో చిన్న విగ్రహాలకు డిమాండ్‌ ఉండేది. గతంతో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తయారు చేసిన విగ్రహాలు అలానే ఉండిపోయాయి. మాకు కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి.
– చెన్నుపాటి శ్రీనివాసాచారి, నాగార్జున
 

శిల్ప కళా కేంద్రం నిర్వాహకుడు, దుర్గి వృత్తిపై మక్కువతోనే..
రెండేళ్ల క్రితం నేను బీటెక్‌ పూర్తి చేశాను. మా కుటుంబం మొత్తం ఈ రంగంలోనే రాణిస్తోంది. మా కుటుంబంలో నేను నాలుగో తరం శిల్పకారుడిని. వృత్తిపై మక్కువతో ఇందులో రాణిస్తున్నాను. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో 150 మంది శిల్పులు పాల్గొనగా నేను రన్నరప్‌గా నిలిచాను. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరికొందరు యువకులు ఈ రంగంలో రాణించడానికి ముందుకొస్తారు. 
– సాయి వినయ్, యువ శిల్పకారుడు, దుర్గి 

మరిన్ని వార్తలు